పూల సింగిడి.. బతుకమ్మ సందడి

ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పూజలు, సంప్రదాయ నైవేద్యాలు, తెలంగాణ పూల పండుగ ప్రత్యేకతలు ఇవే.
Bathukamma Festival celebrations
Telangana Bathukamma Festival Celebrations
Published on: 

ప్రభాత ఉదయం, నాగర్ కర్నూల్:  పూలను పూజించే ప్రకృతి పండుగ బతుకమ్మ. తెలంగాణలోని ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే గునుగు, తంగేడు, బంతి, చామంతులు సహా వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మను పేర్చుతారు. మహిళలంతా ఒక్క చోట చేరి భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో అమ్మవారిని కొలుచుకుంటారు.  ప్రకృతి నుంచి సేకరించి పూజించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం పండుగ ప్రత్యేకత.

సుందరీకరణకు రూ.పది కోట్లు

శనివారం నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు రూ.30 లక్షల చొప్పున రూ.పది కోట్లు కేటాయించనుంది. వీటితో బతుకమ్మ ఘాట్‌ల వద్ద సుందరీకరణ చర్యలు చేపట్టనున్నారు.

తొమ్మిది రోజులు.. ప్రత్యేక నైవేద్యాలు

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ: అమావాస్య రోజు శక్తి స్వరూపిణి గౌరమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా కొలుస్తారు. ఈ రోజు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి పైన గౌరమ్మను ఉంచుతారు. పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.

రెండో రోజు అటుకుల బతుకమ్మ: అటుకులు, బెల్లం, చప్పిడి పప్పు

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లం

నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ:  నానపెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు 

ఐదో రోజు అట్ల బతుకమ్మ: బియ్యం నానబెట్టి దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు.  

ఆరో రోజు అలిగిన బతుకమ్మ: పూర్వ కాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరగడంతో అమ్మవారు పస్తులుంటారని చరిత్ర చెబుతున్నది. దీంతో ఈరోజు బతుకమ్మను పేర్చకపోవడంతో పాటు నైవేద్యం కూడా సమర్పించరు.  

ఏడో రోజు వేపకాయల బతుకమ్మ:  బియ్య పిండిని వేయించి, బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన పిండి వంటను నివేదిస్తారు.

ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ: కొబ్బరి, బెల్లం కలిపి చేసిన వంటకం పెడతారు.

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ: బతుకమ్మను పెద్ద అంత్రాలతో పేర్చి ఆడిపాడుతారు. బెల్లంతో చేసిన నైవేద్యం మహిళలు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు. గౌరమ్మను సాగనంపి మళ్లీ ఏడాది తిరిగి రావాలని వేడుకుంటారు.