

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణలో ఉప ఎన్నికలు అంటే సాధారణ ఎన్నికలను మించిన ఉత్కంఠను రేపుతాయి. ఒక్క సీటు కోసం జరిగే పోరు.. రాష్ట్రవ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల బలాబలాలను తేల్చే ‘మినీ వార్’గా మారుతుంది. ఒక్కోసారి రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతాయి. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఇదే జరిగింది. దేశంలోనే అత్యంత ఖరీదైన, తీవ్రమైన రాజకీయ పోరుగా హుజూరాబాద్ చరిత్రకెక్కింది. ఉప ఎన్నికల విషయానికి వస్తే అధికార పార్టీకే కొంత అదనపు అడ్వాంటేజ్ ఉంటుందనే భావన నెలకొని ఉంది. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ అభిప్రాయానికి కొంత బలం చేకూరుస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 10, పార్లమెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే ప్రతిపక్షాలు అధికార పార్టీలకు షాక్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాజ వచ్చిన ఉప ఎన్నికల చరిత్ర ఏం చెబుతోంది? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఈ సెంటిమెంట్ ఎంత వరకు నిజమైంది? సంబంధిత అంశాలను విశ్లేషిద్దాం..
2014-18.. మూడు బైపోల్స్.. మూడింటా టీఆర్ఎస్దే గెలుపు
2014-18 మధ్య తెలంగాణలో మూడు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో రెండు అసెంబ్లీ స్థానాలకు, ఒకటి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి (కాంగ్రెస్), ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) మరణించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోవైపు 2014 సాధారణ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ లోక్‌సభ స్థానంలోనూ పోటీ చేసి రెండుచోట్ల విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పలేదు.
నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ భారీ విక్టరీ
2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన 2015 ఆగస్టు 25న గుండెపోటుతో మృతి చెందారు. అప్పటికి కిష్టారెడ్డి తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన మరణంతో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో 2016 ఫిబ్రవరి 13న ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ కిష్టారెడ్డి కుమారుడు పట్లోళ్ల సంజీవరెడ్డిని బరిలోకి దింపగా.. అధికార టీఆర్ఎస్ మహారెడ్డి భూపాల్‌రెడ్డిని, టీడీపీ మహారెడ్డి విజయపాల్‌రెడ్డిని అభ్యర్థులుగా నిలిపాయి. ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి 93,076 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451, టీడీపీ అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 14,787 ఓట్లు వచ్చాయి. దీంతో భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
పాలేరులోనూ అదే సీన్.. కాంగ్రెస్ సీటు టీఆర్ఎస్ ఖాతాలోకి
2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన 2016 మార్చి 4న హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో పాలేరు నియోజకవర్గానికి 2016 మే 16న ఉప ఎన్నిక జరిగింది. అధికార టీఆర్ఎస్ తరఫున అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి బరిలో నిలిచారు. సుచరితారెడ్డికి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావుకు 94,940 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికి 49,258 ఓట్లు లభించాయి. దీంతో తుమ్మల 45,682 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మెదక్‌లో మళ్లీ టీఆర్ఎస్ జెండా.. 3.61 లక్షల మెజార్టీ
2014 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గం రెండింటి నుంచీ పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు (జూన్ 2, 2014న ప్రమాణ స్వీకారం చేశారు) గజ్వేల్ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకుని, 2014 మే 26న మెదక్ ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ లోక్‌సభ స్థానానికి 2014 సెప్టెంబర్ 13న ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,71,810 ఓట్లు, సునీతా లక్ష్మారెడ్డికి 2,10,524 ఓట్లు, జగ్గారెడ్డికి 1,86,343 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,61,286 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ విధంగా 2014-18 మధ్య జరిగిన మూడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
2018–23.. ఐదు బైపోల్స్.. మారిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం
2018–23 మధ్య తెలంగాణలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్, మునుగోడు స్థానాల్లో జరిగిన ఈ ఉప ఎన్నికలకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. దుబ్బాక, నాగార్జునసాగర్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోవైపు హుజూర్నగర్, హుజురాబాద్, మునుగోడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
2018–23 మధ్య తొలి ఉప ఎన్నిక సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో 2019 జూన్ 5న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 అక్టోబర్ 21న పోలింగ్ జరిగింది. అధికార టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69,737 ఓట్లు వచ్చాయి. దీంతో సైదిరెడ్డి 43,358 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
దుబ్బాకలో సంచలనం.. బీజేపీ చేతిలో టీఆర్ఎస్కు షాక్
2018 అసెంబ్లీ ఎన్నికలలో సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2020 ఆగస్టు 6న అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. 2020 నవంబర్ 3న పోలింగ్ జరిగింది. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రధానంగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 62,273 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. దీంతో రఘునందన్‌రావు కేవలం 1,079 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నాగార్జునసాగర్.. నిలబెట్టున్న టీఆర్ఎస్
2018 అసెంబ్లీ ఎన్నికలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య ఎమ్మేల్యేగా గెలిచారు. ఆయన 2020 డిసెంబర్ 1న అనారోగ్యంతో మరణించడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వచ్చింది. 2021 ఏప్రిల్ 17న పోలింగ్ జరిగింది. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి పనుగోతు రవి కుమార్ నాయక్ పోటీ చేశారు. నోముల భగత్‌కు 89,804 ఓట్లు, జానారెడ్డికి 70,932 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ 18,449 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
హుజూరాబాద్‌లో ఈటల దెబ్బ.. టీఆర్ఎస్కు మరో షాక్
నాటకీయ పరిణమాల మధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా 2019 ఫిబ్రవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత చోటు చేసుకన్న రాజకీయ పరిణమాల నేపథ్యంలో 2021 మే 1న ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. అనంతరం 2021 జూన్ 4న టీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఈటల.. జూన్ 12న హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేవలం రెండు రోజుల్లోనే, జూన్ 14న బీజేపీలో చేరారు. ఈ పరిణామాలే హుజురాబాద్ ఉప ఎన్నికను సాధారణ బైపోల్ కంటే తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పోరుగా మార్చాయి. 2021 అక్టోబర్ 30న పోలింగ్ జరిగింది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ నర్సింగరావు పోటీ చేశారు. ఈటల రాజేందర్‌కు 1,07,022 ఓట్లు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు 83,167 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23,855 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
టీఆర్ఎస్ ఖాతాలోకి మునుగోడు
మునుగోడు ఉప ఎన్నిక కూడా నాటకీయ పరిణమాలే మధ్య వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన బీజేపీలో చేరే ఉద్దేశంతో 2022 ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా, ఆగస్టు 8న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2022 ఆగస్టు 21: మునుగోడులో నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో అధికారికంగా చేరారు. 2022 నవంబర్ 3న పోలింగ్ జరిగింది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 96,598 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి 86,485 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 23,864 ఓట్లు సాధించారు. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,113 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2019 హుజూర్నగర్ నుంచి 2022 మునుగోడు వరకు.. ఐదు ఉప ఎన్నికలలో హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే.. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది.
2023 తర్వాత.. రెండు బైపోల్స్
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ రెండు చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యంగా జరిగాయి.
కంటోన్మెంట్.. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి లాస్య నందిత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 2024 మే 13న ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ నుంచి డాక్టర్ టి.ఎన్. వంశతిలక్, బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత సాయన్న పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్‌కు 53,651 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి వంశతిలక్కు 40,445 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు 34,462 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీగణేశ్ తన సమీప ప్రత్యర్థి వంశతిలక్పై 13,206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్ జోరు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయన 2025 జూన్ 8న మరణించడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. 2025 నవంబర్ 11న పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ నుంచి వల్లాల నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ నుంచి లంకాల దీపక్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు , బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. దీంతో నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ హవా
2014 నుంచి 2026 సెప్టెంబర్ వరకు మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికను కూడా కలుపుకుని తెలంగాణలో మొత్తం 10 ఉప ఎన్నికలు జరిగాయి. 2014–18 మధ్య మెదక్ లోక్‌సభ, నారాయణఖేడ్, పాలేరు—మూడు ఉప ఎన్నికల్లోనూ అప్పటి అధికార టీఆర్ఎస్ గెలిచింది; 2018–23 మధ్య హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్, మునుగోడు..ఐదు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడు, బీజేపీ రెండు గెలిచాయి; 2023 తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్—రెండు ఉప ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తంగా 10 ఉప ఎన్నికల్లో అధికార పార్టీలే 8 స్థానాలు గెలుచుకోగా, ప్రతిపక్షాలు 2 స్థానాల్లో విజయం సాధించాయి. అంటే అధికార పార్టీల గెలుపు శాతం 80 శాతం, ప్రతిపక్షాల గెలుపు శాతం 20 శాతం. దశలవారీగా చూస్తే 2014–18లో అధికార పార్టీ గెలుపు 100 శాతం (3/3), 2018–23లో 60 శాతం (3/5), 2023 నుంచి ఇప్పటి వరకు 100 శాతం (2/2)గా ఉంది.
ఉప ఎన్నికల్లో గెలిచినా.. సాధారణ ఎన్నికల్లో సీన్ మారింది!
ఉప ఎన్నికల తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలను 2018, 2023 సాధారణ ఎన్నికల ఫలితాలతో కలిపి చూస్తే ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. 2014-18 మధ్య జరిగిన మూడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ.. 2018లో ఆ మూడు స్థానాల్లో రెండింటినే నిలబెట్టుకుంది. నారాయణఖేడ్‌లో 2016 ఉప ఎన్నికలో గెలిచిన మహారెడ్డి భూపాల్‌రెడ్డి 2018లోనూ విజయం సాధించి తన సీటును నిలబెట్టుకున్నారు. కానీ పాలేరులో 2016 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు 2018లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. మెదక్ లోక్‌సభ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. 2018–23 మధ్య జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడు, బీజేపీ రెండు గెలిచాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఐదు స్థానాల్లోనూ ఉప ఎన్నికల ఫలితాల రాజకీయ సమీకరణం మారింది. హుజూర్‌నగర్‌లో 2019 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా.. 2023లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. దుబ్బాకలో 2020 ఉప ఎన్నికలో బీజేపీ గెలిచిన సీటును 2023లో బీఆర్ఎస్ తిరిగి దక్కించుకుంది. నాగార్జునసాగర్‌లో 2021లో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ.. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి గెలిచారు. హుజూరాబాద్‌లో 2021లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ గెలిచిన సీటును 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి దక్కించుకున్నారు. మునుగోడులో 2022 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా.. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తంగా చూస్తే.. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం తర్వాతి సాధారణ ఎన్నికల్లో తప్పనిసరిగా పునరావృతం కాలేదని ఈ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.