

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులు, కేంద్ర సాయం, రైతుల రుణాల రీ షెడ్యూల్ లేదా పంట రుణాల మాఫీ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పంట రుణాలు మాఫీ చేసే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఒకవేళ రుణమాఫీ చేపడితే ఎంత మొత్తానికి పరిమితం చేయాలనే దానిపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తీసుకోనున్నారు. రుణమాఫీ సాధ్యం కాని పరిస్థితుల్లో రైతులను ఎలా ఆదుకోవాలనే అంశంపై కూడా ఏకాభిప్రాయానికి రానున్నారు. రుణాల రీ షెడ్యూల్‌కు బ్యాంకర్లను ఒప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నారు. ఎర్రవల్లిలో భూముల రీ సర్వే అంశంతో పాటు, తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి కాలనీ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశాన్ని రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సభ్యులకు వివరించనున్నారు.