తెలంగాణలో ఫారం-7పై కలకలం

Telangana Fake form 7
Telangana Fake form 7
Published on: 

* బోగస్ దరఖాస్తులు సమర్పించిన వ్యక్తులపై చర్యలకు ఈసీ ఆదేశం

* అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు

* పెద్ద సంఖ్యలో బోగస్ ఫారం-7పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు

న్యూఢిల్లీ : తెలంగాణలో పెద్ద సంఖ్యలో నకిలీ ‘ఫారం-7’ దరఖాస్తులు సమర్పించారంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ఓటర్ల పేర్లు తొలగించాలంటూ బోగస్ దరఖాస్తులు (ఫారం-7) సమర్పించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ సోమవారం రాష్ట ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతున్నవేళ బోగస్ ఫారం-7 అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. ఎన్నికల అధికారులకు నకిలీ దరఖాస్తులు అందాయంటూ తెలంగాణలో ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఫారం-7 బోగస్ దరఖాస్తులు సమర్పించినట్టు ఎన్నికల అధికారుల దృష్టికి వచ్చింది. ముందుగానే ప్రింట్ చేసి ఫారం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు మెమో జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఫారం-6, 6A, 7, 8 దాఖలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముషీరాబాద్‌లో ఫారం-7 సమర్పణపై ఫిర్యాదులు

కాంగ్రెస్‌కు చెందిన బీఎల్‌ఏతో పాటు అతని కుటుంబంలోని 30 మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలంటూ బీజేపీ బూత్‌ లెవల్ ఏజెంట్ ఒకరు ఫారం-7లు సమర్పించాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అతడు సమర్పించిన ఫారం-7 దరఖాస్తు పత్రాలు ముందుగానే ప్రింట్ చేసి సిద్ధం చేసినవిగా కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని కోరింది. బహదూర్‌పురా, గోషామహల్ ప్రాంతాల్లోనూ ఇలాంటివి చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఏమిటీ ఫారం-7

ఎన్నికల కమిషన్ అందజేసే పత్రాల్లో ఫారం-6 కొత్త ఓటర్ల నమోదుకు, ఫారం-8 పేర్లలో తప్పుల సవరణ, చిరునామా మార్పునకు, అలాగే ఫలానా ఓటర్ పేరును తొలగించాలంటే ఫారం-7ను అందజేయాల్సి ఉంటుంది. సదరు ఓటర్‌పై అనుమానం ఉన్నా, అది నకిలీ ఓటు లేదా డూప్లికేట్ ఓటు అని అనుమానం ఉన్నా, ఆ ఓటర్ చనిపోయినా,  ఇలా వివిధ కారణాలతో ఫారం-7 ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అధికారులు సదరు ఫారంను పరిశీలించిన నిర్ధారణ అయ్యాక ఆ ఓటర్ పేరును తొలగిస్తారు.