

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రంలో మొదటి విడత కింద 2024 మార్చి నెలలో 37 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ పదవులు భర్తీ చేశారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో బాధ్యతల స్వీకరణ నిలిచిపోయింది. వీరందరూ జూలై నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రెండో విడతగా ఈ ఏడాది మే నెలలో 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 మంది వైస్ చైర్పర్సన్లను నియమించారు. రెండో విడత భర్తీ చేసిన వాటిలో పూర్తిగా కులాలకు చెందిన కార్పొరేషన్లు ఉన్నాయి. ముఖ్యమైన కార్పొరేషన్ల పదవుల భర్తీలో కాంగ్రెస్ నాయకత్వం, ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం వహించడం నాయకులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పదేళ్ల పాటు అధికారం కోల్పోయి కొత్తగా ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా ఎప్పటికప్పుడు నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడం పనిచేసే నాయకులు, కార్యకర్తలను విస్మరించడమేనన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ముఖ్యమైన టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవిని భర్తీ చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండగా ఇంకెప్పుడు భర్తీ చేస్తారని నాయకులు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుణ్యకాలాన్ని ముగిస్తున్నారు..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు దఫాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత, కాంగ్రెస్ శ్రేణుల శ్రమ ఫలితంగా 2023 సంవత్సరం చివరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత వెంటనే భర్తీ చేయకుండా నాలుగు నెలలు ఆలస్యంగా పుణ్యకాలం గడిచేలా కాంగ్రెస్ పెద్దలు చేశారు. 2024 మార్చి నెలలో తొలిసారి 37 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు మూడు నెలలు ఆలస్యమైంది. మిగతావి ఒకటి రెండు నెలల్లో నియమిస్తారని పలువురు నాయకులు ఆశించి భంగపడ్డారు. రెండేళ్లు పూర్తి కావడంతో ఆ పదవుల్లో కొత్త వారిని నియమించేందుకు కాంగ్రెస్ నాయకత్వానికి వెసులుబాటు లభించింది. ఈ పదవుల భర్తీపై ఢిల్లీలో పార్టీ అగ్రనేతల వద్ద చర్చలు కూడా జరిగాయి.
పదవులు దక్కినా.. అసంతృప్తి
కేవలం కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్‌చైర్మన్ పోస్టులను భర్తీ చేశారు. ఇందులో ప్రధానంగా గౌడ, చేనేత, మున్నూరుకాపు, కమ్మ, బ్రాహ్మణ వడ్డెర, రజక, వాల్మీకి బోయ, భట్టరాజ్, పెరిక కార్పొరేషన్ల ఖాళీలు భర్తీ చేశారు. కులాల కార్పొరేషన్లలో నయా పైస నిధులు లేకపోవడంతో కొత్తగా వచ్చిన వారిలో అసంతృప్తి రాజుకుంటోంది. సబ్సిడీ రుణాలు, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కోసం నిధులు ఎలా సమకూర్చుకోవాలో అర్థంకాని స్థితిలో చైర్మన్లు ఉన్నారు. ఎవరికి వారుగా సచివాలయంలో మంత్రులను కలిసి తమ బాధలు, ఆవేదనను వారితో వెల్లగక్కుతున్నా నిధులు ఆశించిన స్థాయిలో విడుదల కావడం లేదంటున్నారు.
కొత్త వారికే మొగ్గు..
రెండేళ్లుగా చైర్మన్లు, వైస్ చైర్మన్ల పనితీరుపై గత జూలై నెలలో కాంగ్రెస్ నాయకత్వం నివేదికలు సిద్ధం చేసింది. రెన్యువల్ కోసం పాత చైర్మన్లు ప్రయత్నిస్తుండగా, తమకు పదవులు దక్కుతాయా లేదా అనే ఆందోళనలో నాయకులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీజీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డిలు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇందులో చాలా మందిని తప్పించి కొత్తవారిని నియమించాలనే నిర్ణయానికి కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చారు. ప్రస్తుతం ఖాళీ అయిన వాటితో పాటు ఇప్పటి వరకు భర్తీ కాని 50కి పైగా కార్పొరేషన్ పదవులు అందుబాటులో ఉన్నాయి.