ఐవీఎఫ్ అక్రమాలపై సర్కార్ నజర్

అక్రమ అండాల సేకరణ ముఠాతో సంబంధాలున్న ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
Damodar Rajanarasimha
మంత్రి దామోదర రాజనర్సింహ
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమాల్లో భాగస్వాములైన వైద్యుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం అరికట్టిందని, తాజాగా అండాల అక్రమ సేకరణకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి పట్టుకున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యశాఖ అధికారులు నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగిస్తున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వైద్యులపై స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం వారి లైసెన్సుల రద్దుకు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఐవీఎఫ్ సేవల విస్తరణ చర్యలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సరోగసి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) చట్టాల అమలును పటిష్ఠం చేయడంపై మరింత దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఈ చట్టాల అమలులో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.