

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : సైబర్ క్రైమ్ నేరాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అవగాహన కల్గిస్తున్నప్పటికీ నేరాల సంఖ్య, నష్టపోయిన మొత్తాల రికవరీ, రిఫండ్లలో మాత్రం అశించిన స్థాయిలో ప్రగతి కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ విభాగంలో తెలంగాణ పోలీస్ శాఖ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నట్లు ప్రశంసలు అందుతున్నా, క్రైమ్ రేట్ , రికవరీ, రిఫండ్ విషయాలలో విమర్శలు ఎదుర్కొన్నది. 2026లో 20 శాతం సైబర్ నేరాలు తగ్గినట్లు చెబుతున్నప్పటికీ బాధితులకు రిఫండ్ మరీ దారుణంగా 8 నుంచి 10 శాతం వరకు మాత్రమే ఉండటం గమనార్హం.
గతేడాదితో పోల్చితే తగ్గిన సైబర్ క్రైమ్‌లు
గత మూడు సంవత్సరాలో సైబర్ క్రైమ్ ద్వారా బాధితులు రూ.4 వేల కోట్లు కోల్పోయినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదికలు తెలియచేస్తున్నాయి. బాధితుల పిర్యాదుతో బ్యాంక్ లావాదేవీలను స్తంభింప చేయడం ద్వారా నేరగాళ్లు కొట్టేసిన డబ్బులను ఫ్రీజ్ చేస్తున్నారు. నేరగాళ్లు వివిధ కేసులలో నిందితులుగా ఉండంతో ఫ్రీజ్ చేసిన మొత్తం రిఫండ్ జరగడం లేదు. రీకవరీ విషయంలో సైబర్ సెక్యూరిటీ తెలుపుతున్న గణాంకాలు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని, రికవరీ బాధితులకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం అవుతుంది.
42 శాతం పెరిగిన ఫ్రీజింగ్
సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలలో లీన్(ఫ్రీజ్) చేసిన మొత్తం 2025 జనవరి-సెప్టెంబర్ కాలంలో రూ.183.11 కోట్లు ఉండగా, 2026లో రూ.260.30 కోట్లకు పెరిగిందని సైబర్ సెక్యూరిటీ డీజీ అక్టోబర్ మాసోత్సవం సందర్భంగా వెల్లడించారు. ఫ్రీజ్ చేసిన మొత్తం రూ.77.19 కోట్ల మేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఫ్రీజ్ చేసిన మొత్తంలో 42 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. అయితే బాధితులకు జరిగిన రిఫండ్ గణంకాల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. 2025 జనవరి–సెప్టెంబర్ మధ్య సైబర్ నేరాల కారణంగా నమోదైన మొత్తం ఆర్థిక నష్టం రూ.1,104.42 కోట్లు ఉండగా, 2026లో సెప్టెంబర్ వరకు మొత్తం రూ.881.72 కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. గతేడాదితో పోల్చితే రూ.222.70 కోట్ల మేర ఆర్థిక నష్టం తగ్గినట్లు పేర్కొన్నారు.
చిన్న మొత్తాలలో తగ్గిన ఫిర్యాదులు
సైబర్ మోసాల బాధితలలో రికవరీ, రిఫండ్‌పై నమ్మకం లేకపోవడంతో సైబర్ సెక్యూరిటికి వస్తున్న ఫిర్యాదులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2023లో 91,652 ఫిర్యాదులు నమోదయ్యాయి. 16,339 ఎఫ్ఐఆర్లు కాగా, రూ.7798 కోట్ల నష్టం వాటిల్లింది. 1830 మంది బాధితులకు రూ.8.36 కోట్లు రిఫండ్ అందాయి. 2024లో 1,14,174 ఫిర్యాదులు రాగా 24,643 ఎఫ్ఐఆర్ చేశారు. రూ.1753 కోట్లు నష్టం జరగగా రూ. 176 కోట్లు రిఫండ్ జరిగింది. గత రెండు సంవత్సరాల కాలంలో చిన్న మొత్తాలు పోగొట్టుకున్న వారు కూడా గణనీయంగా ఉన్నప్పటికీ, స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సరైన స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.10వేల మొదలుకుని రూ.1లక్ష వరకు పోగొట్టుకున్న బాధితులు 2025లో, 2026 సంవత్సరంలో దాదాపు లక్షకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది. 2025లో 7,636 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 35.9% శాతం కేసుల సంఖ్య తగ్గినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పేర్కొంది. బాధితులు ఫిర్యాదు చేయక పోవడం వల్లే కేసులు తగ్గుముఖం పట్టాయని తేటతెల్లమవుతుంది. నష్ట పోతున్న బాధితుల సంఖ్య , నష్ట పోయిన మొత్తం ప్రతి సంవత్సరం పెరుగుతున్నప్పటికీ కేసుల నమోదు సంఖ్య తగ్గడం గమనార్హం.
ఫలితాలివ్వని అవగాహన కార్యక్రమాలు
2023 మే నెలలో ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరాలు, మోసాలపై ఇప్పటికదాకా లక్షకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొంది. దాదాపు 48 లక్షల మందికి అవగాహన కలిగించినట్లు తెలిపింది. 2026 అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసోత్సవంగా పేర్కొని, ప్రత్యేకంగా 4,248 అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 2,78,428 మంది ప్రజలను భాగస్వాములను చేసినట్లు వెల్లడించింది. అయినా ఆశించిన స్థాయిలో సైబర్ నేరాలు తగ్గలేదు.