

ప్రభాత ఉదయం, హైదరాబాద్: రాష్ట్రంలోని డేటా సెంటర్లలో అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన భద్రతాచర్యలపై తెలంగాణ అగ్నిమాపక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు భద్రతా ప్రమాణాలను మెరుగుపరించేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లుగా ఫైర్ సెఫ్టీ డీజీ విక్రమ్ మాన్‌సింగ్ తెలిపారు. నవంబర్ 6 నుంచి మార్గదర్శకాలు అమలు కానున్నట్లు పేర్కొన్నారు. డేటా సెంటర్లకు తాత్కాలిక ఫైర్ ఎన్‌ఓసీల జారీ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు వేగవంతమైన నిర్వహణను (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించడం మార్గదర్శకాల ఉద్దేశం అని డీజీ తెలిపారు. మార్గదర్శకాలను తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారిక వెబ్‌సైట్ www.fire.telangana.gov.inలో పూర్తి వివరాలు పొందు పరచినట్లు తెలిపారు.
డేటా సెంటర్లలో సర్వర్లు, యూపీఎస్‌లు, బ్యాటరీలు, ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, విద్యుత్ కేబుళ్లు ఉండటంతో అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలను గుర్తించే అలారాలు, ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు, వాటర్ మిస్ట్, క్లీన్ ఏజెంట్ గ్యాస్ ఆధారిత అగ్నిమాపక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. బ్యాటరీ, యూపీఎస్, ట్రాన్స్‌ఫార్మర్ గదుల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని, తగినంత నీటి నిల్వలు, అగ్నిమాపక పంపులు, వెంటిలేషన్, అత్యవసర విద్యుత్ నిలిపివేత వ్యవస్థలు అందుబాటులో ఉండాలని తెలిపారు.