

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది. రబీ సీజన్లో లక్ష ఎకరాల్లో కూరగాయలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరికి బదులుగా పండ్లు, ఉల్లి, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని యోచిస్తోంది. తక్కువ నీటితో సాగు చేసే వెరైటీలను కూడా ఎంపిక చేసి రైతుల్లో మరింత అవగాహన కల్పించనుంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచే రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫోకస్ చేసింది. ఫలితంగా గతేడాది 40 వేల ఎకరాల్లో మాత్రమే సాగైన కూరగాయలు.. ఖరీఫ్ సీజన్లో 80 వేల ఎకరాలకు పెరిగాయి. కాగా, రబీ సీజన్లో సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేసేలా అధికారులు ప్లాన్ వేశారు. ఉల్లిని 12,862 ఎకరాల్లో పండించాలని టార్గెట్ పెట్టుకున్నారు. గతేడాది ఈ సీజన్లో కేవలం 2941 ఎకరాల్లో మాత్రమే ఉల్లిని పండించారు. పండ్ల తోటలను 7979 ఎకరాల్లో, ఆయిల్ పామ్‌ను 55,081 ఎకరాల్లో సాగు చేయనున్నారు.
నీటి లభ్యతను బట్టి ఆయా పంటల సాగు
ఎల్‌నినో కారణంగా తక్కువ నీటితో సాగయ్యే వంగడాలపై దృష్టి పెట్టాలని తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శిటీ సూచించింది. వంకాయలో వినాయక్, త్కర్ష, పచ్చిమిర్చిలో తేజ, ఎల్సీఏ-334, బెండలో వీబీహెచ్-11, చిక్కుడులో ఆర్కాజయ, గోరుచిక్కుడులో పూసా నవబహార్, అలసందలో అర్కా గరిమ, దోసలో గుమ్మడి రకం, ఆర్ఎన్ఎస్ఎం 1, 3, ములక్కాడలో పీకేఎం-1 పీకేఎం-2, కొంకార్, రుచి, పాలకూరలో ఆల్ గ్రీన్, తోటకూరలో ఆర్ఎన్ఏ1, కొత్తిమీరలో ఏపీహెచ్ సీఓ-1, మెంతికూరలో ఏఎప్ జీ-1 రకం వంగడాలను సాగుచేయాలని హార్టికల్చర్ అధికారులు రైతులను కోరుతున్నారు. ముల్లంగి, మెంతి, కొత్తిమీర, తోటకూర, పాలకూర తక్కువ నీరు లేదా తేమతో సాగుచేసే అనువైన పంటలని, వీటి వైపు రైతులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. మధ్యస్థ తేమ లేదా రెండు లేదా నాలుగు సార్లు నీళ్లు అందిస్తే బెండ, చిక్కుడు, బీన్స్, ముల్లంగి, ఆకుకూరలు, స్నాప్ మెలోన్, దోసకాయ వంటి పంటలు సాగు చేయవచ్చని చెబుతున్నారు. తేమతో పాటు నీటి సౌకర్యం ఉంటే టమాట, వంకాయ, మిరప, క్యాప్సికం, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బంగాళాదుంప, బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి, బఠానీలు, బీన్స్, దోసకాయ, పుచ్చకాయ, కర్బూజా, కాకరకాయ, తాత్కాలిక పందిరితో బీరకాయ పంటలు వేయవచ్చని వెల్లడిస్తున్నారు.
రైతు నేస్తం, రైతు వేదికల్లో అవగాహన
ఆయా అంశాలపై ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంతోపాటు, రైతు వేదికల్లో అవగాహన కల్పిస్తున్నారు. వరి కోసిన తర్వాత ఆ నేలలో ఉన్న తేమ ఆధారంగా కూడా కొన్ని కూరగాయలు పండించే అవకాశం ఉందని, పాలకూర సహా కొన్ని ఆకుకూరలు, కూరగాయలు కూడా సాగు చేయవచ్చని రైతులకు సూచిస్తున్నారు. దుక్కులను మరీ లోతుగా దున్నితే భూమిలో తేమ త్వరగా కోల్పోయే అవకాశం ఉన్నందున, తక్కువ లోతులో విత్తుకోవాలని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ప్రతి వారం ఆయా జిల్లాల్లోని మండలాలవారీగా భూగర్భజలలాల వివరాలు, రానున్న వారం రోజుల్లో వాతావరణ సమాచారాన్ని రైతులకు తెలియజేయనున్నారు. వాతావరణ సూచనల ఆధారంగా రైతులు ముందు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు.