

ప్రభాత ఉదయం, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను గురువారం ఆదేశించారు. కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం, వర్షపాతం లోటును మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, వర్షపాత వ్యత్యాసం, రిజర్వాయర్ నిల్వలు, భూగర్భ జల పరిస్థితులు, ప్రవాహ జలాలు, పశుగ్రాసం, తాగునీరు, ఉపాధి, వలసలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 నుంచి 59 శాతం లోటు ఉంటే లోటు వర్షపాతంగా, 60 నుంచి 99 శాతం లోటు ఉంటే భారీ లోటుగా, వర్షం పూర్తిగా లేకపోతే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణించాలని నిబంధనలు ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సాగు విస్తీర్ణం సాధారణంతో పోలిస్తే 85 శాతం కంటే తక్కువగా ఉండటం కరువు పరిస్థితికి, 75 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండటం తీవ్రమైన కరువు పరిస్థితికి సూచికగా పరిగణించాలని తుమ్మల తెలిపారు.