

ప్రభాత ఉదయం, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణను కరువు భయం మళ్లీ వెంటాడుతోంది. వర్షాలు సకాలంలో కురవకపోవడం, సాగునీటి లభ్యతపై అనిశ్చితి, పంటల దిగుబడిపై ఆందోళనలు రైతాంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇది కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. రైతు కుటుంబాల జీవనోపాధి నుంచి వ్యవసాయ కూలీల పనిదినాల వరకు, గ్రామీణ వ్యాపారాల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాల ఖర్చుల వరకు ప్రభావం చూపే సంక్షోభం. గతంలో కరువు ఎదురైన ప్రతిసారీ గ్రామీణ జీవితాలు ఎలా తల్లడిల్లాయో గుర్తుచేసుకుంటే, ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన ఎందుకు పెరుగుతోందో అర్థమవుతుంది. 1972లో దేశాన్ని కుదిపేసిన కరువు నుంచి 1992, 2002, 2004, 2009, 2015, 2023లో ఎదురైన వర్షాభావ పరిస్థితుల వరకు.. ప్రతి సంక్షోభం వ్యవసాయంపై ప్రకృతి ఆధిపత్యాన్ని, నీటి వనరుల పరిమితులను గుర్తుచేస్తోంది. అయితే, కరువు పరిస్థితులు కచ్చితంగా ప్రతి పదేళ్లకోసారి వస్తాయని చెప్పలేం. ఎల్‌నినో ప్రభావం, రుతుపవనాల తీరు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, స్థానిక వర్షపాతం, నీటి నిర్వహణ వంటి అనేక అంశాలు కరువు తీవ్రతను నిర్ణయిస్తాయి. ఈ ఏడాది సంభవించిన ‘సూపర్ ఎల్‌నినో’ కారణంగా 22 శాతం రాష్ట్ర వర్షపాతం లోటు ఏర్పడింది. 10 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు క్షేత్రస్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ప్రతికూల పరిణామాలతో సరాసరిగా రూ.20 వేల కోట్ల నష్టం జరిగినట్టు అంచనా.
1972లోనే మహా కరువు
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎల్‌నినో కారణంగా అత్యంత దారుణమైన వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు నమోదయ్యాయి. 1972లో ఇది మహా కరువుగా నిలిచింది. వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత 1992లో వచ్చిన కరువును అత్యంత దారుణ కరువుగా పేర్కొన్నారు. అప్పుడు ఏకంగా 39.3 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఇది గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత దారుణమైన లోటుగా రికార్డయ్యింది. 2002లో తెలంగాణ ప్రాంతంలో 28.3 శాతం వర్షపాత లోటు ఏర్పడి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2004లో తెలంగాణలో సాధారణం కంటే 35.7 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బావులు, చెరువులు ఎండిపోయి వ్యవసాయ రంగం కుదేలైంది. 2009లో ఎల్‌నినో తీవ్రత వల్ల రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేసింది. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో ఎల్‌నినో సెగలు తప్పలేదు. 2015లో రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఎల్‌నినో కరువు ఛాయలు కమ్మేశాయి. జూన్ నెలలో వర్షాలు బాగున్నా, ఆగస్టు వచ్చేసరికి 28.5 శాతం వర్షపాతం లోటు ఏర్పడి పంటలు ఎండిపోయాయి. 2023 జూలైలో భారీ వర్షాలు (120.4శాతం అదనపు వర్షపాతం) పడినప్పటికీ, ఎల్‌నినో ప్రభావం ప్రారంభం కావడంతో ఆగస్టు నెలలో ఏకంగా 54.5 శాతం భారీ వర్షపాత లోటు నమోదైంది. దీనివల్ల కీలకమైన పంట దశల్లో నీరు అందక రైతులు నష్టపోయారు.
ఎల్‌నినో.. చరిత్రలోనే భయంకరమైన కరువు
ప్రస్తుతం ‘సూపర్ ఎల్‌నినో’ చరిత్రలోనే మరో భయంకరమైన కరువును మోసుకొచ్చింది. దీని కారణంగా తెలంగాణలో 22 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43 శాతం వర్షపాతం లోటు నమోదై, వందలాది మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా మారాయి. విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లను ఆన్ చేస్తుండటంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో 2002, 2004, 2009లో ఎల్‌నినో కరువు వచ్చినప్పుడు కూడా విద్యుత్ లోటు మరింత ఎక్కువ నమోదైంది. అప్పట్లో ఇంత సాంకేతికత, ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్ కొనుగోలు చేసే సదుపాయాలు లేక పట్టణాల్లో 4 నుంచి 6 గంటలు, గ్రామాల్లో 8 నుంచి 12 గంటల పాటు అధికారికంగా విద్యుత్ కోతలు విధించారు. ఉమ్మడి ఏపీలో రైతులకు కేవలం 7 గంటలు లేదా 9 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలు కకావికలం
కరువు పరిస్థితులు ఎప్పుడొచ్చినా తెలుగు రాష్ట్రాలను కకావికలం చేశాయి. వ్యవసాయరంగాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరి రైతును నిండా ముంచాయి. తాగునీటి వెతలు, కరెంటు కష్టాలు, భూగర్బ జలాలు అడుగంటి పోవడం.. అంతిమంగా మొదట ఎఫెక్టయ్యింది మాత్రం వ్యవసాయ రంగమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు పీడించిన కరువు పరిస్థితులు ఐదు సార్లు వచ్చాయి. అవి జనాలను పీడించడమే కాకుండా.. రైతుల జీవితాలతో ఆడుకున్నాయి. వ్యవసాయ రంగాన్ని తల్లడిల్లేలా చేశాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా మొత్తం మూడు సార్లు కరువు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తాజా సూపర్ ఎల్‌నినోతో కలిపి మొత్తం మూడు సార్లు తెలంగాణను ఆగమాగం చేశాయి. తాజాగా తెలంగాణలో సూపర్ ఎల్‌నినో తన ప్రభావం చూపడం షురూ చేసింది. ఇప్పుడు వేసిన వరి సాగు కోత దశకు వచ్చే నాటికి 10 లక్షల ఎకరాల్లో నష్టం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 20వేల కోట్ల నష్టం వాటిల్లే కరువు ప్రమాదంగా అధికారులు లెక్కలు కడుతున్నారు. ఎల్‌నినో కరువుల వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడి, తీవ్ర వర్షాభావం ఏర్పడటం వల్ల జలాశయాలు, భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటాయి. వర్షాభావం ఏర్పడినప్పుడు ముందుగా నష్టపోయేది పంట. ఆ నష్ట ప్రభావం అనేక కుటుంబాలకు విస్తరిస్తుంది. రైతులతో పాటు రోజువారీ కూలి మీద ఆధారపడి జీవించే రైతు కూలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతాయి. ఒక రైతు పొలంలో మొదలైన సంక్షోభం క్రమంగా మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో పంట నష్టంతో పాటు కుటుంబ జీవనోపాధి కూడా దెబ్బతినకుండా ప్రభుత్వ వ్యవస్థలు ముందుగానే స్పందించాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.