కరువున్నా గుర్తించలే...

రాష్ట్రంలో 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా, తక్కువ వర్షపాతం నమోదైన మరికొన్ని మండలాలను విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana drought-affected mandals list
తెలంగాణ ప్రభుత్వం 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.
Published on: 

ప్రభాత ఉదయం, నెట్ వర్క్ : రాష్ట్ర  వ్యాప్తంగా 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం... అర్హత గల కొన్ని మండలాలను మాత్రం విస్మరించింది. కరువు జాబితాలో చోటు దక్కిన మండలాల కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను సైతం పట్టించుకోకపోవడం పట్ల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కరువు మండలాలను అసలు ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. కరువు మండలాల ఎంపికలో ప్రభుత్వం శాస్త్రీయంగా వ్యవహరించలేదని మండిపడుతున్నారు. కరువు మండలాల ప్రకటన విషయంలో ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలన చేయాలని, తక్కువ వర్షపాతం నమోదైన, భూగర్భ జలాలు అడుగంటిన మరికొన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు, రైతులు కోరుతున్నారు. మెదక్ జిల్లాలో ఒకే మండలాన్ని ప్రకటించి, మిగతా వాటిని పట్టించుకోకపోవడంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంతో పాటు ఆందోళనకు సిద్ధమయ్యారు.

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 63 మండలాలు ఉండగా.. ఎనిమిది మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. వాస్తవానికి మిగతా మండలాల్లో కూడా అత్యధిక లోటు వర్షపాతం ఉన్నప్పటికీ కరువు మండలాల జాబితాలో చోటు కల్పించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ టౌన్ 21 శాతం, రూరల్ లో 23 శాతం, హుజురాబాద్ లో 42 శాతం లోటు వర్షపాతం ఉండగా వీటిని కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ ఇదే జిల్లాలో 40 శాతం లోటు ఉన్న వీణవంక, 33 శాతం ఉన్న జమ్మికుంట, 35 శాతం ఉన్న ఇల్లందకుంటకు మాత్రం కరువు మండలాల జాబితాలో చోటు దక్కలేదు.

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లిలో 2 శాతం, ఇల్లంతకుంటలో ఒక శాతం లోటు వర్షపాతమే ఉన్నా కరువు మండలాల్లో చోటు దక్కగా... 31 శాతం ఉన్న రుద్రంగి, 21 శాతం ఉన్న చందుర్తిని మాత్రం పట్టించుకోలేదు.

  • జగిత్యాల జిల్లాలో 22 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఉన్న ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెటపల్లి, కథలాపూర్, గొల్లపల్లి, భీమారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసింది.

  • పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో 35 శాతం, ఎలిగేడులో 27 శాతం, జూలపల్లిలో 23 శాతం, మంథనిలో 23 శాతం లోటు వర్షపాతం నమోదైనా కరువు మండలాలుగా ప్రకటించలేదు.

  • మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్, మహమ్మదాబాద్, మిడ్జిల్, నవాబ్ పేట ప్రాంతాలకు కరువు మండలాల జాబితాలో చోటు దక్కలేదు. ఆయా మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడం, 33 శాతం కంటే ఎక్కువ పంటలు ఎండిపోకపోవడం వల్లే ఎంపిక చేయలేదని తెలుస్తోంది.

  • నాగర్ కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండలంలో 51 శాతం లోటు వర్షపాతం నమోదైనా కరువు మండలాల జాబితాలో చోటు దక్కపోవడం వల్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ మండలంలో 19 శాతం, కొల్లాపూర్ మండలంలో 29 శాతం, తాడూర్ మండలంలో 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అలాగే ఉప్పునుంతల మండలంలో 14 శాతం లోటు, తిమ్మాజీపేట మండలంలో 34 శాతం, తెల్కపల్లి మండలంలో 30 శాతం లోటు ఉంది. అయితే కల్వకుర్తి ఎతిపోతల పథకం కాల్వల ద్వారా ఆయా మండలాల్లో నీటి సరఫరా జరుగుతోంది.

  • వనపర్తి జిల్లాలోని నాలుగు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు. ఇందులో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపురం మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లోని పంట పొలాలకు కేఎల్ఐ ప్రధాన కాల్వలు, బీమా, పీజేపీ, శ్రీరంగ సముద్రం, రామన్ పాడ్, జూరాల నుంచి సాగు నీరు అందుతోంది. చిన్నంబావి మండలంలోని చివరి ఆయకట్టుకు మాత్రం సాగు నీరు అందడం కాస్త ఇబ్బందిగా మారింది. ఇక్కడి రైతులు జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని ధర్నాలు సైతం చేశారు. కాగా, చిన్నంబావి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే అవకాశం ఉందని, అందుకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి పంపిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజనేయులు చెప్పారు.

  • నల్గొండ జిల్లాలోని అనుముల, గుర్రంపోడు మండలాలను కరువు ప్రాంతాల నుంచి మినహాయించారు. సాగర్ ఎడమ కాల్వకు ఏడాది కాలంగా నీరు విడుదల కాకపోవడంతో అనుముల మండలంలో పంటల సాగు ఇబ్బందిగా మారింది. గతంలో 15 వేల ఎకరాల్లో సాగైన వరి ప్రస్తుతం 4 వేల ఎకరాలకే పరిమితం అయింది. గుర్రంపోడు మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి. ఈ రెండు మండలాలను కరువు జాబితాలో చేర్చకపోవడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలానికి కరువు ప్రాంత జాబితాలో చోటు దక్కలేదు. ఈ మండలంలో 29 గ్రామాలు ఉండగా.. 13 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత ఏర్పడింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే పత్తి, మిర్చి సాగు తగ్గిపోయింది. బోర్లపై ఆధారపడి వరి సాగు చేసినా.. ప్రస్తుతం నీరందకపోవడంతో అది కూడా ఎండిపోతోంది. ప్రభుత్వం స్పందించి మఠంపల్లి మండలాన్ని సైతం కరువు మండలాల జాబితాలో చేర్చాలని స్థానికులు కోరుతున్నారు.

  • మెదక్ జిల్లాలో కరువు మండలాల ఎంపిక సరిగా జరగలేదని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా... పారిశ్రామిక ప్రాంతమైన మనోహరాబాద్ ను మాత్రమే కరువు మండలంగా ఎంపిక చేశారు. మనోహరాబాద్ కన్నా ఎక్కువ లోటు వర్షపాతం ఉన్న నర్సాపూర్, చిలప్ చేడ్ మండలాలను ఎందుకు ఎంపిక చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని చిలప్ చేడ్, అల్లాదు దుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, వెల్దుర్తి, మాసాయిపేట, నార్సింగి, టెక్మాల్ మండలాల్లో గతేడాది అక్టోబర్ తో పోలిస్తే ఈ సారి 5.7 శాతం నీటి మట్టాలు తగ్గిపోయాయి. మరో వైపు నిజాంపేట, రామాయంపేట, చేగుంట మండలాల్లో సైతం నీటి మట్టాలు పడిపోతున్నాయి. దీంతో ఈ మండలాలను సైతం కరువు మండలాలుగా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు స్వరాజ్య వేదిక, సిటిజన్స్ ఫోరం, ప్రెస్ క్లబ్ సంయుక్తంగా శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ కొండల్ రెడ్డి ప్రకటించారు.  “మెదక్ జిల్లాలో 10 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి, కరువు మండలాల ఎంపిక ఏ ప్రాతిపదికన చేశారో ప్రజలకు చెప్పాలి, మెదక్ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 1000 కోట్లు ఇవ్వాలి” అని సీపీఐ నేత మల్లేశ్ డిమాండ్ చేశారు.

  • కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉండగా... ఐదు మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రభుత్వం  ప్రకటించింది. కానీ మిగతా 10 మండలాల్లో సైతం పంటలు ఎండిపోవడం, దిగుబడి తగ్గడం, రెండో పంటకు అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితి ప్రకారం ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

  • నిర్మల్ జిల్లా తానూరు మండలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు తీవ్రత కనిపిస్తున్నా కరువు మండలాల జాబితాలో చోటు దక్కలేదు. వర్షాలు కురవక, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పత్తి, సోయాబీన్, కంది పంటలు ఎండిపోతున్నాయి. తానూరును కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.