గోవాలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు.. తెలంగాణలో 1,000 మందికిపైగా లింకులు!

గోవాలో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై ఈగల్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ ముఠాకు తెలంగాణలో వెయ్యి మందికిపైగా వినియోగదారులతో సంబంధాలున్నట్లు అధికారులు తెలిపారు.
Telangana Eagle Force
Telangana Eagle Force Busts Goa Drug Network
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్:  తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరాను అరికట్టేందుకు ఈగల్‌ ఫోర్స్‌ ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసుల సమన్వయంతో గోవాలో నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు.. గోవాలో పట్టుబడ్డ ముఠాకు తెలంగాణలో వెయ్యి మందికిపైగా డ్రగ్స్‌ వినియోగదారులతో సంబంధాలున్నట్లు వెల్లడించారు.

అంజునా కేంద్రంగా డ్రగ్స్‌ సరఫరా

గోవాలోని అంజునా ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పృతీశ్‌ నారాయణ్‌ బోర్కర్‌ అలియాస్‌ బాబూ అలియాస్‌ ఖలీని సోమవారం అరెస్టు చేశారు. అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ ముఠాకు ఆంధ్రప్రదేశ్‌లోనూ నెట్‌వర్క్‌ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు

నిందితుడిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎన్‌డీపీఎస్‌ కేసులో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రాంగోపాల్‌పేట్‌, లాలాగూడ, మియాపూర్‌, అల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్లలోనూ అతడిపై కేసులున్నట్లు అధికారులు తెలిపారు.

ఎల్‌ఎస్‌డీ, ఎక్స్టసీ, చరస్‌ స్వాధీనం

ఉత్తర గోవాలో మరో నిందితుడు బషారత్‌ అహ్మద్‌ ధగ్గ అలియాస్‌ బిలాల్‌ అలియాస్‌ జహాన్‌ ధగ్గ అలియాస్‌ మన్సూర్‌ అహ్మద్‌ను కూడా అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 13 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, ఎనిమిది ఎక్స్టసీ మాత్రలు, సుమారు 100 గ్రాముల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌, అల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్లలో నమోదైన డ్రగ్స్‌ కేసుల్లోనూ అతడు నిందితుడిగా ఉన్నట్లు ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు.