కల్మష ప్రేమలు.. కాఠిన్య బంధాలు!

పెద్దల పట్ల గౌరవం, మానవీయ విలువలు పెంపొందించేందుకు ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.
Students from a government girls school interacting with senior citizens during a visit to an old age
Published on: 

  ప్రభాత ఉదయం, పాలకుర్తి, మానకొండూరు, జగిత్యాల :

కన్న ప్రేమ కరిగిపోతోంది.. అనుబంధాలు రోజురోజుకు భారమైపోతున్నాయి. కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించాల్సిన బిడ్డలే.. తమకెందుకులే అనుకుంటూ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారు. కొందరు కన్నతల్లిని రోడ్డున పడేస్తే, మరికొందరు కన్నబిడ్డలు ఆదరించేలా చూడాలంటూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పాలకుర్తి, మానకొండూరు, జగిత్యాల ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనలు సమాజంలో క్షీణిస్తున్న మానవతా విలువలకు అద్దం పడుతున్నాయి.

కొడుకులు పట్టించుకోవడం ఫిర్యాదు

కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధురాలు ఆర్డీవోను ఆశ్రయించింది. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరుకు చెందిన శ్రీరాం వీరమ్మ, వెంకట్ రాములు దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వెంకట్ రాములు గతంలోనే చనిపోయాడు. పెద్ద కొడుకు కండక్టర్‌గా ఉద్యోగ విరమణ చేయగా, చిన్న కొడుకు కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. “జీవితకాలమంతా కష్టపడి పిల్లలను పోషించాం, భర్త కట్టించిన ఇంటిని సైతం ఇద్దరు కొడుకులు అమ్మేసుకున్నారు. నన్ను పట్టించుకోవడం, లేదు. అన్నం కూడా పెట్టడం లేదు” అంటూ వీరమ్మ సోమవారం తొర్రూరు ఆర్డీవో గణేశ్‌కు ఫిర్యాదు చేసింది. తనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని, చిన్న కూతురు వద్ద ఉంటున్నానని ఫిర్యాదులో పేర్కొంది. ఆరోగ్యం క్షీణిస్తున్నందున, తన పోషణ బాధ్యతలు కొడుకులు తీసుకునేలా చూడాలని ఆర్డీవోను వేడుకుంది.

రోడ్డున పడ్డానయ్యా...

కొడుకు చనిపోవడం, కూతుళ్లు పట్టించుకోకపోవడంతో ఓ వృద్ధురాలు రోడ్డున పడింది. ఈ ఘటన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో జరిగింది. తమిళకాలనీకి చెందిన నల్ల రాజేశ్వరి (65) భర్త గతంలోనే చనిపోవడంతో కొడుకు దగ్గర ఉండేది. మేస్త్రీగా పనిచేసే కొడుకు సైతం ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోవడంతో ఒంటరిగా మారింది. తన ఇంటిని సైతం గతంలోనే బంధువులకు అమ్మేసింది. బతికున్నన్ని రోజులు అదే ఇంట్లో ఉంచుకుంటామని ఒప్పందం చేసుకున్న బంధువులు ఇటీవల గెంటేసి ఇంటికి తాళం వేశారు. రాజేశ్వరికి పక్షవాతం రావడంతో కన్న కూతుళ్లు సైతం రోడ్డున వదిలేశారు. దీంతో రెండు రోజులుగా కాలనీవాసులే భోజనం పెడుతూ ఆదుకుంటున్నారు. కార్పొరేటర్ కాల్వ మల్లేశం న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఆదరించేవారు లేక...

నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధుడు చివరకు విగత జీవిగా మారాడు. మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లికి చెందిన పాక కొమురయ్య (70) గతనెల 27 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సోమవారం గ్రామంలోని యాదవకాలనీ సమీపంలో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్లి చూడగా కొమురయ్య మృతదేహం కనిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు.

అమ్మా.. నన్ను తీసుకెళ్లు !

 ‘అమ్మా భయమేస్తోంది, నన్ను తీసుకెళ్లమ్మా’ అంటూ ఓ చిన్నారి వేడుకుంటున్న దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఓవైపు చిన్నారి, మరో వైపు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్​కు పిల్లలు లేకపోవడంతో గతంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఓ బాలుడిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి సీడబ్ల్యూసీ అధికారులకు చెప్పడంతో వారు బాలుడిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లడంతో.. చిన్నారిని వారికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ శిశు సంరక్షణ కేంద్రం అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చిన్నారి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో వైపు ‘మా బిడ్డ ఆరోగ్యం క్షిణిస్తోంది, బరువు కూడా తగ్గిపోతున్నాడు, వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసి మా బిడ్డను అప్పగించాలి’ అని తల్లిదండ్రులు కలెక్టర్‌ను ఆశ్రయించార

వృద్ధాశ్రమంలో ‘నాయనమ్మ’ ఆదర్శం

విద్యార్థుల్లో మానవీయ విలువలు, పెద్దల పట్ల గౌరవభావం పెంచాలన్న ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలికల స్కూల్ టీచర్లు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఏడో తరగతి తెలుగు పుస్తకంలోని ‘నాయనమ్మ’ పాఠ్యాంశ బోధనలో భాగంగా విద్యార్థులను లింగంపేట మండలంలోని జీవదాన్ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు వృద్ధులకు పండ్లు, బిస్కట్లు అందజేసి, వారితో మాట్లాడి జీవిత అనుభవాలు, కష్టసుఖాలు తెలుసుకున్నారు. పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితులను తెలుసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ‘మీ నాయనమ్మ, తాతయ్యలను ప్రేమగా చూసుకోండి’ అని వృద్ధులు విద్యార్థులకు సూచించారు.