

ప్రభాత ఉదయం, హైదరాబాద్: బియ్యం అక్రమ వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అధిక ధరలకు విక్రయించడం, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, తూనికలు-కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్టోబర్ 29 నుంచి 31 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
బ్రాండెడ్ కంపెనీల బస్తాల్లో రేషన్ బియ్యం నింపి విక్రయిస్తున్న వ్యవహారం కూడా తనిఖీల్లో బయటపడింది. ఈ అక్రమాలపై సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 18 వ్యాపార సంస్థలతో పాటు 11 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
26 కిలోలు ఉండాల్సిన బియ్యం బస్తాల్లో 25 కిలోలే తూకం వేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కంపెనీలు ముద్రించిన అసలు ధరలపై ఎక్కువ ధరలతో కూడిన స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నట్లు తేల్చారు. ట్రేడ్, జీఎస్టీ, లేబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తదితర అనుమతులు, లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.