

జలపాతాన్ని చూస్తే మనసుకు తెలియకుండానే ఓ ప్రశాంతత ఆవరిస్తుంది. ఎత్తైన కొండలపై నుంచి జాలువారే నీటి ధారలను చూస్తూ.. వాటి హోరును వింటూ.. కొద్దిసేపైనా లోకాన్ని మరిచిపోయే అనుభూతి కలుగుతుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి జలపాతాల సందర్శన ఎప్పుడూ ప్రత్యేకమే. రాళ్లను తాకుతూ జలజల పారే నీరు.. చుట్టూ పచ్చని అడవులు.. కొండల మధ్య మారుమోగే జలధారల శబ్దం.. చల్లని నీటి తుంపర్లు.. ఇవన్నీ కలిసి మనసుకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. ఇలాంటి అద్భుతమైన ప్రకృతి అందాలకు తెలంగాణ కూడా కొదువలేదు. ఉరకలెత్తే ఈ జలధారలు తెలంగాణ ప్రకృతి సౌందర్యానికి సరికొత్త శోభను తీసుకొస్తాయి. ఆ జలపాతాలు ఎక్కడ ఉన్నాయి? వాటికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వాటి పేర్ల వెనుక ఉన్న కథలేంటి? సమీపంలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలేంటి? తెలుసుకుందాం..
కుంటాల జలపాతం
ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలో కడెం నదిపై కుంటాల జలపాతం ఉంటుంది. సుమారు 45 మీటర్ల ఎత్తు (సుమారు 147-150 అడుగులు) నుంచి కడెం నది జలాలు రాతి కొండపై నుంచి కిందికి జాలువారుతూ సృష్టించే దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నీటి హోరు, చుట్టూ పచ్చని అడవులు, కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణం కుంటాలకు ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. ఈ జలపాతం పేరుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన స్థానిక కథనం కూడా ప్రచారంలో ఉంది. మహాభారత కాలానికి చెందిన శకుంతల ఇక్కడి ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కొంతకాలం నివసించిందని, ఈ జలధారలో స్నానం చేసేదని స్థానిక కథ చెబుతుంది. ఆమె పేరుతోనే ఈ ప్రాంతానికి ‘శకుంతల’ నుంచి ‘కుంటాల’ అనే పేరు వచ్చిందని ప్రచారం ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 260–270 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంటాలను జూలై నుంచి డిసెంబర్ వరకు సందర్శించవచ్చు. ఈ జలపాతానికి సమీపంలో గాయత్రి జలపాతం, పొచ్చర జలపాతం, కడెం ప్రాజెక్టు వంటి పర్యాటక ప్రాంతాలు ఉంటాయి.
గాయత్రి జలపాతం
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తర్నం బీ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య గాయత్రి జలపాతం కొలువై ఉంది. నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య ప్రవహించే గుండి వాగుతో పాటు బజార్ హత్పూర్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల అటవీ ప్రాంతాల్లోని కొండలు, వాగుల నుంచి వచ్చే నీటి ప్రవాహాలు ఇక్కడి రాతి శిలలపై నుంచి జాలువారుతూ జలపాతంగా రూపుదిద్దుకుంటాయి. సుమారు 363 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడే జలధారలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. జలపాతం హోరు సంగీతాన్ని తలపించేలా వినిపిస్తే.. చల్లటి నీటి తుంపర్లు శీతాకాలంలో మంచుబిందువులను గుర్తుచేస్తాయి. దట్టమైన అడవి మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్ నుంచి సుమారు 270–290 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి జలపాతాన్ని జూలై నుంచి డిసెంబర్ వరకు సందర్శించడం అనుకూలం. కుంటాల, పొచ్చెర జలపాతాలు, కడెం ప్రాంతాలు సమీప ఆకర్షణలు.
పొచ్చెర జలపాతం
ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో, పొచ్చెర గ్రామ సమీపంలో జాతీయ రహదారి నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతం కనిపిస్తుంది. చిన్న చిన్న కొండవాగుల ప్రవాహం రాళ్లను తాకుతూ ఉధృతంగా కిందికి దూకే దృశ్యం ఈ జలపాతానికి ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడుతుంది. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉండే ఈ జలపాతం ఇతర జలపాతాలతో పోలిస్తే ప్రత్యేకమైన సహజ నిర్మాణాన్ని కలిగి ఉంది. గోదావరి నదీ ప్రవాహం నుంచి వచ్చే నీరు అనేక పాయలుగా ప్రవహించి ఈ ప్రాంతంలో కలుస్తుంది. అక్కడి నుంచి సుమారు 20 మీటర్ల ఎత్తు నుంచి కిందికి జాలువారుతూ అందమైన జలపాతాన్ని ఏర్పరుస్తుంది. అడవి, కొండలు, రాళ్ల మధ్య ఉరకలెత్తే నీటి ప్రవాహం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. హైదరాబాద్ నుంచి సుమారు 280–300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొచ్చెరను జూలై నుంచి జనవరి వరకు సందర్శించవచ్చు. కుంటాల, గాయత్రి జలపాతాలు, కడెం ప్రాజెక్ట్ సమీప పర్యాటక ఆకర్షణలు.
బొగత జలపాతం
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత గ్రామం సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని ప్రేమగా ‘తెలంగాణ నయాగరా’ అని పిలుస్తారు. కాళేశ్వరం–భద్రాచలం అడవుల మధ్య పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న ఈ జలపాతం వర్షాకాలంలో మరింత ఉధృతంగా మారుతుంది. వాజేడు మండల కేంద్రానికి 5 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కొండలు, అడవుల నుంచి వచ్చే వాగు నీరు సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకి పెద్ద జలాశయంలా ఏర్పడుతుంది. ముఖ్యంగా జూలై నుంచి నవంబర్ వరకు జలపాతం నీటి ఉధృతి ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 300–330 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగతను జూలై నుంచి నవంబర్ వరకు సందర్శించడం ఉత్తమం. సమీపంలో మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయం, లక్నవరం సరస్సు, తాడ్వాయి అడవులు, మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
భీముని పాదం జలపాతం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొమ్ములవంచ పరిధిలోని అటవీ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య భీముని పాదం జలపాతం సహజసిద్ధంగా ఏర్పడింది. పాకాల సరస్సు ఓవర్ఫ్లో నీరు, చుట్టుపక్కల అటవీ వంకల నుంచి వచ్చే ప్రవాహాలు ఈ జలపాతానికి ప్రధాన ఆధారం. సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటి ధారలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆసక్తికరమైన స్థానిక విశ్వాసం కూడా ఉంది. పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు భీముని కారణంగా నీరు ఊరిందని, జలపాతం పైభాగంలో భీముని పాదముద్ర ఉందని స్థానికులు నమ్ముతారు. ఈ విశ్వాసం కారణంగానే దీనికి ‘భీముని పాదం’ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి సుమారు 200–220 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీముని పాదం జలపాతాన్ని జూలై నుంచి జనవరి వరకు సందర్శించవచ్చు. సమీపంలో పాకాల సరస్సు, రామప్ప టెంపుల్, వరంగల్ భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల గుడి వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
మల్లెల తీర్థం జలపాతం
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో విస్తరించిన దట్టమైన నల్లమల అడవుల మధ్య మల్లెల తీర్థం జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. సుమారు 500 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలధార చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కలిసి అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ ప్రాంతం పేరుకు సంబంధించి ఒక స్థానిక కథనం ఉంది. పూర్వం నల్లమల మునులు, యోగులు ఇక్కడ తపస్సు చేస్తూ శివుడికి మల్లెపూలతో పూజలు చేసి, ఈ జలధారలో స్నానమాచరించేవారని చెబుతారు. అందుకే దీనికి ‘మల్లెల తీర్థం’ అనే పేరు వచ్చిందని స్థానిక విశ్వాసం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఉన్న అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామం నుంచి సుమారు 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. సమీపంలో శ్రీశైలం క్షేత్రం, అమ్రాబాద్ వ్యూ పాయింట్, ఉమామహేశ్వరం ఉన్నాయి.
సప్తగుండాల / మిట్టె జలపాతం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం పిట్టగూడ గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సప్తగుండాల జలపాతం ఉంది. ఇక్కడ ఒకే జలపాతం కాకుండా ఏడు చిన్న జలపాతాలు వరుసగా ఏర్పడి ప్రకృతి అందాలను పంచుతాయి. రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాల సమాహారాన్ని సప్తగుండాల లేదా మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఎత్తైన కొండల నుంచి వచ్చే నీరు సుమారు 100 మీటర్ల దిగువన ఉన్న లోయలోకి జాలువారుతుంది. ప్రధాన రహదారి నుంచి జలపాతం చేరుకోవాలంటే సుమారు 3 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో కాలినడకన వెళ్లాలి. ముఖ్యంగా జూలై నుంచి డిసెంబర్ మధ్య నీటి ప్రవాహం బాగుంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 300–330 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్తగుండాలను జూలై నుంచి డిసెంబర్ వరకు సందర్శించవచ్చు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, జైనథ్ లక్ష్మీనారాయణ ఆలయం సమీప పర్యాటక ఆకర్షణలు.
కనకాయ్ జలపాతం
ఆదిలాబాద్ జిల్లాలోని కుంతాల జలపాతానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, గిర్నూర్ సమీపంలో కనకాయ్ జలపాతం ఉంది. దీనిని కనకదుర్గ జలపాతం అని కూడా పిలుస్తారు. ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక్క జలపాతం కాదు.. మూడు జలపాతాల సముదాయం. ఇందులో ఒకటి కనకాయ్ జలపాతం, రెండోది బండ్రేవు జలపాతం, మూడోది చీకటిగుండం. వందల అడుగుల ఎత్తైన కొండల వరుస శిఖరాల మధ్య నుంచి నీరు ఒక్కసారిగా నింగి నుంచి నేలకు దూకుతున్నట్టుగా కనిపించే దృశ్యం కనకాయ్ జలపాతానికి ప్రత్యేక ఆకర్షణ. కొండలు, అడవి, రాతి నిర్మాణాల మధ్య ఉరకలెత్తే జలధారలు ఈ ప్రాంతాన్ని అద్భుతమైన ప్రకృతి పర్యాటక కేంద్రంగా నిలబెడుతున్నాయి. . హైదరాబాద్ నుంచి సుమారు 280–300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకాయ్ జలపాతాన్ని జూలై నుంచి డిసెంబర్ వరకు సందర్శించవచ్చు. కుంతాల, గాయత్రి, పొచ్చెర జలపాతాలు ఈ ప్రాంతంలోని ఇతర ప్రకృతి ఆకర్షణలు.