

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు అగ్నిమాపక శాఖ జారీచేసే ఎన్వోసీ విధానాన్ని సులభతరం చేసినట్లు ఫైర్ సెఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ బుధవారం వెల్లడించారు. పాత భవనాల్లో మౌలిక వసతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఆచరణ సాధ్యమైన కొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు డీజీ వెల్లడించారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 8న జరిగిన సమావేశంలో స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, చర్చల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాత భవనాల్లో నిర్దేశిత ఖాళీ స్థలాలు, అదనపు మెట్ల మార్గాల ఏర్పాటు సాధ్యం కాకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అయితే, ఫైర్ బ్రిగేడ్ ఇన్‌లెట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అదనపు ఖాళీ స్థలాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే నిబంధన నుంచి వెసులుబాటు కల్పించారు. కొత్త రూల్స్ నవంబర్ 10 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఒక్కసారి ఎన్వోసీ తీసుకుంటే మూడేళ్ల పాటు అనుమతి ఉంటుందని డీజీ పేర్కొన్నారు.