రాష్ట్రంలో మొదలైన పశు గ్రాసం కొరత.. విత్తనాల పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు!

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. అవసరానికి 20 శాతం తక్కువగా మేత లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Grass cultivation and fodder supply for livestock amid drought conditions in Telangana
Published on: 

ప్రభాత ఉదయం, బ్యూరో: రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావంతో పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పశువులకు గడ్డి సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. రెండు కోట్లకు పైబడి పశువులు ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 శాతం మేర గ్రాసానికి కొరత ఏర్పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు.  

2.60 కోట్ల పశువులు

రాష్ట్రంలో 2.60 కోట్ల యూనిట్ల పశువులున్నాయి. ఇందులో 31 లక్షలు ఆవు జాతులు, 30.51 లక్షల గేదె జాతులు, 1.53 కోట్ల గొర్రెలు, 43 లక్షల మేకలున్నాయి. ప్రతి పశువుకు రోజుకు 5 కిలోల మేత లేదా ఎండు పదార్థం(డ్రైమ్యాటర్) అవసరం. ఈ లెక్కన జూలై నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఉన్న పశువులకు 96 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం ఉన్నట్లు అధికారుల అంచనాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో పండించిన వివిధ రకాల పంటల ఆధారంగా 125 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం ఉంటుందని పశుసంవర్థక శాఖ అంచనా వేసింది. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన 96 లక్షల మెట్రిక్ టన్నులకు కూడా 20 శాతం తక్కువగా గ్రాసం లభ్యమయ్యే పరిస్థితి నెలకొందని అధికారులు గుర్తించారు.

గడ్డి విత్తన పంపిణీకి ఏర్పాట్లు

పశుగ్రాసానికి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గడ్డి విత్తనాలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాల పంపిణీకి సర్కార్ అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. కిలో విత్తనాలకు రేటు ఖరారు కావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో రెండో విడత గడ్డి విత్తనాల పంపిణీని ప్రారంభించనున్నట్లు పేర్కొంటున్నారు.

1000 టన్నుల విత్తనాలు అవసరం

గడ్డి విత్తనాలకు సంబంధించి తొలుత జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం సుమారు 750 టన్నులు అవసరం. కానీ, ఇటీవల కాలంలో ఈ డిమాండ్ మరింత పెరిగింది. 1000 టన్నుల గడ్డి విత్తనాలు అవసరం పడే అవకాశం ఉందని పశుసంవర్థక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గడ్డి విత్తనాలు టన్నుకు బహిరంగ మార్కెట్​లో గతేడాది రూ.18 నుంచి 19 వేలకు విక్రయించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై టన్నుకు రూ.2,100కు సరఫరా చేశారు. వీబీజీ రామ్ జీ పథకం కింద గడ్డి విత్తనాలు సాగు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద గడ్డి విత్తనాలు సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.14 వేలు చెల్లిస్తారు. అయితే ఈ పథకం ఒక్క ఎకరాకు మాత్రమే వర్తిస్తుంది. నీరు అడుగంటిన చెరువుల్లో స్వయం సహాయక సంఘాలు గడ్డి విత్తనాలు సాగు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. 5 ఎకరాల్లో వీబీజీ రామ్ జీ పథకం కింద పశుగ్రాసం కోసం సేద్యం చేయవచ్చు. ఈ సంఘాలకు ఉచితంగా ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తుంది.