

ప్రభాత ఉదయం, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ పరిధి మరింత పెరుగనున్నది. వందకు పైగా గ్రామాలు భవిష్యత్ నగరిలో భాగం కానున్నాయి. స్థానికుల నుంచి వస్తున్న డిమాండ్లు, వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. మహేశ్వరం మండలం మొత్తాన్ని ఫ్యూచర్ సిటీలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే యాచారం, కందుకూరు మండలాల్లోని మొత్తం గ్రామపంచాయతీలతోపాటు కడ్తాల్ మండలంలోని కొన్ని పల్లెలు ఈ సిటీలో కలిశాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) పరిధిలో 71 రెవెన్యూ గ్రామాలు ఉండగా, మహేశ్వరం మండలం నుంచి 32 కలువనుండటంతో ఆ సంఖ్య 103కు చేరనున్నది. కొత్తగా కలిసే పంచాయతీలు తీర్మానం చేయడమే మిగిలింది. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించే వీలున్నది. ఈ మేరకు ప్రభుత్వం కలెక్టర్ నారాయణరెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల విలీనంపైనా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. ‘భౌగోళికంగా అనుకూలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కలుపాలని ప్రజల మద్దతుతో ఆందోళనలకు శ్రీకారం చుట్టాం. దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగిన ఈ ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా కలిసొచ్చారు. అన్నివర్గాల ప్రజలు సహకరించారు’ అని ఫ్యూచర్ సీటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వత్తుల రఘుపతి, గౌరవ అధ్యక్షుడు కర్నాటి మనోహర్ తెలిపారు.
ఎఫ్సీడీఏలో కలిసే మహేశ్వరం మండల గ్రామాలు..
మహేశ్వరం, మంఖాల్, సిరిగిరిపూర్, గంగారం, కొంగరకుర్దు, మన్సాన్పల్లి, మొహబ్బత్నగర్, రావిర్యాల, సర్దార్నగర్, శ్రీనగర్, నందపల్లి, సుభాన్పూర్, తుప్రాకుర్దు, వెంకన్నగూడ, ఆల్మాస్గూడ, బాగ్మంఖాల్, అకన్పల్లి, అమీర్పేట, దిల్వార్గూడ, డబిల్గూడ, దుబ్బచెర్ల, కల్వకోల్, ఇమాంగూడ, ఘట్పల్లి, మలిక్దాన్గూడ, తుమ్మలూరు, గొల్లూరు, నాగిరెడ్డి పల్లి, పెండ్యాల, నాగారం, పోరండ్ల, కోళ్లపడ్కల్.
పెరుగనున్న విస్తీర్ణం...
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం వడివడిగా కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా యాచారం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం మండలాల్లోని 71 గ్రామాల పరిధిలో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కొత్తగా మహేశ్వరం మండలంలోని 32 గ్రామాలు విలీనం కానుండటంతో అది మరింత విస్తరించనున్నది. మొన్నటివరకు నాగార్జున సాగర్, శ్రీశైలం రహదారుల మధ్య విస్తరించిన ఫ్యూచర్ సిటీ.. ఇకపై బెంగళూరు హైవేను తాకనున్నది.