

హైదరాబాద్, ప్రభాత ఉదయం: వీబీజీరామ్ పథకం కింద గ్రామీణాభివృద్ధిలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్‌టీఈ)లకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వారి గ్రాట్యూటీ సమస్యకు పరిష్కారం చూపింది. అర్హులైన ఎఫ్‌టీఈ ఉద్యోగులకు గ్రాట్యూటీ ప్రయోజనాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో 548ను జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 3,800 మంది ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో ఆర్థిక భరోసా లభించనుంది.
గ్రాట్యూటీ కోసం ప్రత్యేక నిధులు
గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన ఎఫ్‌టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనాలను వర్తింపజేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. గతంలో సెర్ప్ పరిధిలోని ఎఫ్‌టీఈలకు అందుతున్న ప్రయోజనాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రాట్యూటీ చెల్లింపుల కోసం ఎల్‌ఐసీ లేదా ఇతర బీమా సంస్థ ద్వారా గ్రూప్ గ్రాట్యూటీ లేదా గ్రాట్యుటీ ఫండ్ ఏర్పాటు చేయాలని జీవోలో పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న, భవిష్యత్‌లో ఏర్పడే గ్రాట్యూటీని అంచనా వేసి నిధులు సమకూర్చేలా యాక్చువేరియల్ వాల్యుయేషన్ నిర్వహించాలని, ఇందుకు నెలకు సుమారు రూ.కోటి అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని వీబీ-జీ రామ్ జీ పథకం అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ నుంచి భరించేందుకు అనుమతి లభించింది. ప్రాథమికంగా గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.16 లక్షలుగా నిర్ణయించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వర్తిస్తున్న ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా, చట్టపరమైన నిబంధనలకు లోబడి అమలు చేయనున్నారు. గ్రాట్యుటీ అర్హత సర్వీసును లెక్కించే సమయంలో ఎఫ్టీఈగా నియామకం పొందిన లేదా ఆ హోదాలోకి మారిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని జీవోలో స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో అర్హులైన ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీ రూపంలో ఆర్థిక భరోసా లభించనుంది. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన సర్వీసును పూర్తి చేసిన ఉద్యోగులకు అర్హత, నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క
ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. ‘కష్టపడి పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడొద్దనేది ప్రభుత్వ సంకల్పం. ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నాం.’ దీనిపై ఎఫ్‌టీఈ ఉద్యోగులు స్పందిస్తూ మా దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించి గ్రాట్యుటీ ప్రయోజనాలు కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు ఎఫ్‌టీఈ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ‘రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డిమాండ్‌కు పరిష్కారం లభించడం ఉద్యోగుల కుటుంబాల్లో భరోసా నింపింది’ అని పేర్కొన్నారు.