

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, వారి వ్యాపారాలకు పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు స్త్రీ శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ నేపథ్యంలో ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. సోమవారం సెక్రటేరియట్లో కౌన్సిల్ తొలి సమావేశం మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు స్వయం సహాయక సంఘాల నెట్‌వర్క్‌ల ద్వారా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలకు పెట్టుబడులు, మార్కెట్లు, అనుకూలమైన ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉండాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను సంక్షేమ కోణంలో మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక బలాన్ని పెంచే కీలక రంగంగా గుర్తించాలని పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు ‘వుయ్ హబ్’ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ‘పాలసీ– సంస్థాగత నాయకత్వం, పట్టణ ఆవిష్కరణలు–పారిశ్రామికీకరణ, సమ్మిళిత వ్యాపారాలు– పెట్టుబడులు, కార్పొరేట్ భాగస్వామ్యాలు’ అనే కీలక రంగాలపై కౌన్సిల్ దృష్టి సారిస్తుందన్నారు. వుయ్ హబ్ సీఈవో సీత పల్లచోళ్ల మాట్లాడుతూ మహిళా వ్యాపారవేత్తలకు ఆశయాలు, సామర్థ్యాల కొరత లేదని, పెట్టుబడులు, వినియోగదారులు, మార్కెట్లు, వ్యాపార నెట్‌వర్క్‌లకు చేరువ కావడంలోనే ప్రధాన అడ్డంకులు ఉన్నాయన్నారు. ఈ కౌన్సిల్ ద్వారా ఆ సమస్యలకు సాధ్యమైన పరిష్కారాలను గుర్తించి, ప్రభుత్వ విధానాల ద్వారా అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కౌన్సిల్ సిఫారసులతో మహిళా పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్వేతపత్రాన్ని గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేయనున్నారు. వుయ్ హబ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ సంబంధిత శాఖల సమన్వయంతో సిఫారసుల అమలుకు తోడ్పడనుంది.