భూ అక్రమాలపై విచారణకు ప్రత్యేక కమిటీ

భూ అక్రమాలపై విచారణకు ప్రత్యేక కమిటీ
Published on: 

·      కేసీఆర్ కుటుంబ భూములే టార్గెట్ ?

·      బీఆర్ఎస్ మాజీ మంత్రులపైనా ఫోకస్

·      ఐఏఎస్ దేవసేన అధ్యక్షతన కమిటీ

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీని సర్కార్ నియమించింది. ఐఏఎస్ అధికారి దేవసేన అధ్యక్ష్తతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీవో నెంబర్ 134ను జారీ చేసింది. దేవసేన చైర్‌పర్సన్‌గా ఉన్న ఈ కమిటీలో కన్వీనర్‌గా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంతు, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు సంబంధిత జిల్లాల కలెక్టర్లను కూడా కమిటీ సభ్యులుగా నియామకం అయ్యారు. చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలపై ఈ కమిటీ ఆరా తీయనుంది. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చి తగిన చర్యలకు సిఫార్సులు చేయనుంది.

ఈ భూములే కమిటీ టార్గెట్

ఎర్రవెల్లిలోని కేసీఆర్, ఆయన కుటుంబ భూములు, సిద్దిపేట జిల్లాలోని హరీష్ రావు, రంగనాయకసాగర్ సమీపంలోని భూములపై కమిటీ విచారణ చేయనుంది. మల్లన్నసాగర్ భూసేకరణలో అక్రమాల ఆరోపణలు, జన్వాడలో కేటీఆర్ కుటుంబ సభ్యులు, అనుచరులు కొనుగోలు చేసిన భూములు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరుల భూములు,  గంగుల కమలాకర్‌కు సంబంధించిన ప్రభుత్వ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేయనుంది.  వట్టినాగులపల్లిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి భూములు, శంకరాహిల్స్ భూముల కొనుగోలు వ్యవహారం,  జీరా భూముల్లో ఎల్విన్ స్టీఫెన్‌సన్ లీజ్ భూముల రెగ్యులరైజేషన్‌, భూదాన్ భూముల కొనుగోలు వ్యవహారాలపై విచారణ చేయనుంది. ధరణి మాడ్యూల్ దుర్వినియోగం, మహబూబ్‌నగర్ జిల్లా గుండేడ్‌లోని పలు సంస్థల వ్యవహారం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్, ప్రభుత్వ భూముల కేటాయింపులు,  మిడ్ మానేర్ రిజర్వాయర్ పరిహారం, R&R ప్యాకేజీల వ్యవహారంపైనా ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ చేయనుంది. అవసరమైన రికార్డులు, పత్రాలు, డేటాను కోరే అధికారం ఈ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ విచారణ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి కమిటీ సమర్పించనుంది.