‘ఫ్యూచర్ సిటీ’ మరింత విస్తృతం : ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు

భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిని మరింత విస్తరించి, దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలతో జైపాల్‌రెడ్డి పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Bharat Future City expansion and proposed new Jaipal Reddy district
భారత్ ఫ్యూచర్ సిటీ
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్​: భారీ పెట్టుబడులు, భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారుతుందని ఆశిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ పరిధిని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్​ మరింత విస్తరించనున్న నేపథ్యంలో  సిటీలో సిటీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి భారత్​ ఫ్యూచర్​ సిటీ పరిధిని పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆయన సూచనల మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్డీసీఏ) ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఫ్యూచర్​ సిటీని ఆనుకొని ఉన్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్‌ వ్యవస్థీకరణను చేపట్టనుంది.

జైపాల్​రెడ్డి పేరిట కొత్త జిల్లా?

తెలంగాణ పాలనా ముఖచిత్రంలో చెరగని ముద్ర ఉండాలన్న కోణంలో సంస్థాగత, భౌగోళికమార్పులకు కాంగ్రెస్​ సర్కార్​ సిద్ధమవుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్​ సిటీ పోలీస్​ కమిషనరేట్​లో ఇప్పటికే మహేశ్వరం, షాద్​నగర్​, చేవేళ్ల జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్​, కొత్తూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి స్వగ్రామం మాడ్గుల(కల్వకుర్తి నియోజకవర్గం) కూడా ఈ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంతాలను కలుపుతూ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని దాదాపుగా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ జిల్లా పరిధిలోకి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతోపాటు పరిసర ప్రాంతాలను చేర్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ ప్రాంతంతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్ఆర్) అవతల ఉన్న కొత్తూరు, పెద్దషాపూర్‌ తదితర ప్రాంతాలను కలపనున్నారు. ప్రస్తుతం ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో మహేశ్వరం నుంచి 28, కందుకూరు నుంచి 9 గ్రామాలు చేర్చగా, మహేశ్వరం మండలం మొత్తాన్ని ఇందులో కలపాలంటూ రంగారెడ్డి కలెక్టర్‌ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాను కూడా పునర్‌ వ్యవస్థీకరించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు తుది రూపం ఇచ్చి త్వరలో అధికార ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.