గ్రామాల అభివృద్ధికి ‘జీపీశాప్‌’

తెలంగాణలోని గ్రామాలను అభివృద్ధి చేసి, ‘తెలంగాణ రైజింగ్‌–2047’ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ప్రతి గ్రామపంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తోంది.
గ్రామాల అభివృద్ధికి ‘జీపీశాప్‌’
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : తెలంగాణలోని గ్రామాలను అభివృద్ధి చేసి, ‘తెలంగాణ రైజింగ్‌–2047’ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ప్రతి గ్రామపంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీశాప్‌)ను రూపొందిస్తోంది. గ్రామ సమగ్ర సమాచారం, ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల వివరాలు, ఇప్పటికే చేపట్టిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఈ విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘తెలంగాణ గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక నిబంధనలు–2026’ను ప్రభుత్వం జారీ చేసింది. జీవో నంబర్‌ 42 ద్వారా ఈ నిబంధనలను నోటిఫై చేసింది. ఇప్పటివరకు గ్రామాల్లో వివిధ శాఖలు తమ పరిధిలోని పథకాలు, అభివృద్ధి పనులకు విడివిడిగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీంతో గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులను సమన్వయం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జీపీ శాప్‌ విధానాన్ని తీసుకొచ్చారు. గ్రామంలోని ప్రతి కుటుంబ పరిస్థితి నుంచి మౌలిక సదుపాయాల వరకు సమగ్ర సమాచారాన్ని సేకరించి, అందుబాటులో ఉన్న నిధులను సమన్వయం చేస్తూ ఒకే అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తారు. దీంతో ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది? ఎక్కడ ఏ వసతులు అవసరం? ఉపాధి అవకాశాలను ఎక్కడ పెంచాలి? పథకాల అర్హులెవరు? వంటి అంశాలపై క్లారిటీ వస్తుంది. అధికారులు ఇప్పటికే గ్రామాల ప్రొఫైల్‌ వివరాలను నమోదు చేస్తున్నారు. 90 శాతం గ్రామాల్లో సమగ్ర ప్రొఫైల్‌ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

గ్రామ సమగ్ర సమాచారం ఒకే చోట..

ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధికి సంబంధించిన సమాచారం, ప్రణాళికలు, పనుల పురోగతిని ప్రజలు, అధికారులు తెలుసుకునేలా వెబ్‌సైట్‌, డాష్‌బోర్డు వ్యవస్థను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గ్రామానికి సంబంధించిన సమాచారం కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకే వేదికపై గ్రామ అభివృద్ధి స్థితిగతులను పరిశీలించే అవకాశం ఉంటుంది.

అధికారుల విధులు ఇలా..

జీపీ శాప్​  అమలుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీ కార్యదర్శి గ్రామంలోని కుటుంబాలు, ఉపాధి, గృహవసతి, పశుసంపద, ఆస్తులు, బలహీన వర్గాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి నమోదు చేయాలి. ప్రతి నెలా సమాచారాన్ని అప్​డేట్​ చేయడంతో పాటు జీపీశాప్‌ పోర్టల్‌లో వివరాలను పర్యవేక్షించాలి. ఎంపీఓతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్‌, ఉపాధి హామీ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయించి, తుది ప్రణాళికపై సంతకాలు చేయాలి. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల ప్రణాళికల రూపకల్పన, డేటా నమోదు, శాఖల మధ్య సమన్వయానికి ఎంపీడీవో బాధ్యత వహిస్తారు. సర్పంచులు ప్రతి నెలా జరిగే సమావేశంలో జీపీశాప్‌ను మొదటి అజెండాగా చర్చించి, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించాలి. స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ ప్రణాళిక అమలు, డేటా అప్​డేట్​, పనుల పురోగతిని పర్యవేక్షిస్తారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ 127 ప్రకారం కోరిన సమాచారాన్ని అందించాలి. నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా సెక్షన్‌ 135 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.