

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పెంచినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. గ్రాడ్యుయేట్లు నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 6వ తేదీతో ముగియనుంది. నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఆరోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు.
ఎన్నికల సంఘం స్పష్టత
గ్రాడ్యుయేట్లు ఫారం-18 దరఖాస్తులను నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ సమర్పించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. అంతేకాకుండా, డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురణ తర్వాత నుంచి నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ వరకు కూడా దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. దీంతో పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి మూడు విడతల్లో అవకాశం కల్పించారు.
సాంకేతిక లోపంతో ఇబ్బందులు
రెండు రోజులుగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు నమోదు పోర్టల్ పనిచేయకపోవడంతో పట్టభద్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తులు ప్రక్రియ నిలిచిపోయింది. చివర తేదీ దగ్గర పడుతుండటంతో నమోదుకు గడువు పెంచాలని పట్టభద్రులు, వివిధ పార్టీల నేతలు ఈసీకి వినతులు అందజేశారు. ఈ నేపథ్యంలో సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పందించారు. పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అర్హులైన వారు ఓటుహక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఓటు నమోదుకు గడువు పెంచినట్టు చెప్పారు.