

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీల సొంత ఖాతాల్లోనే జమ కానున్నాయి. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. తెలంగాణ పంచాయతీరాజ్(నాలుగో సవరణ)చట్టం–2026కు చేపట్టిన ఈ సవరణ 2026 అక్టోబర్ 9 నుంచే అమలులోకి వస్తుందని పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం విడుదల చేసిన జీవో 43లో పేర్కొంది. గతంలో గ్రామ పంచాయతీలు సమకూర్చుకున్న సొంత ఆదాయం ట్రెజరీ ద్వారా ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులకు నిధుల విడుదలలో జాప్యం జరిగేది. ఇక నుంచి పంచాయతీ సొంత ఖాతాల్లోనే జమ కానుండటంతో, స్థానిక అవసరాలకు నిధులను వేగంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది. గ్రామాల అభివృద్ధికి పంచాయతీలే మరింత బాధ్యతతో నిర్ణయాలు తీసుకునేలా, స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను పెంచే దిశగా పల్లెల ఆర్థిక స్వాలంబనకు ఇది కీలక ముందడుగని మంత్రి సీతక్క ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు.