భార్య ఫిర్యాదుతో ఉద్యోగం తొలగించడమేంటి? హైకోర్టు

ఎస్సై కె.జానయ్య తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.
Telangana High Court SI probation dismissal case
Telangana High Court
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : భార్య పెట్టిన క్రిమినల్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడనే కారణంతో ఎస్సై ప్రొబేషన్‌ను ఖరారు చేయకుండా ఉద్యోగం నుంచి తొలగించడం సమర్థనీయం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది.

2018 నవంబరు 20న కె.జానయ్య సివిల్‌ ఎస్సైగా నియమితులయ్యారు. ఆయనకు రెండేళ్ల ప్రొబేషన్‌ విధించారు. ఈ సమయంలో భార్య ఫిర్యాదు మేరకు 2021లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-1 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జానయ్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. దీంతో అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. దీనిని సవాలు చేస్తూ జానయ్య హైకోర్టును ఆశ్రయించగా.. 2022 ఏప్రిల్‌ 29న న్యాయస్థానం విచారణపై స్టే విధించింది.

మరోవైపు, రెండేళ్ల ప్రొబేషన్‌ పూర్తయినా అధికారులు దానిని మరో ఆరు నెలలు పొడిగించారు. అనంతరం పనితీరు సంతృప్తికరంగా లేదనే కారణంతో 2025 మే 26న జానయ్యను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ ఆయన రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. ప్రొబేషన్‌ పొడిగింపు, దానిని ఖరారు చేయకపోవడం, ఉద్యోగం నుంచి తొలగింపును పక్కనపెడుతూ 2026 ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

విచారణలో భాగంగా విధి నిర్వహణలో జానయ్య దురుసుగా ప్రవర్తించినట్లు, ప్రభుత్వ ఉద్యోగానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. భార్య ఫిర్యాదుపై నమోదైన క్రిమినల్‌ కేసు ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, శాఖాపరమైన విచారణపై హైకోర్టు స్టే విధించినప్పటికీ అధికారులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారని గుర్తుచేసింది. జానయ్య పనితీరు వల్ల ప్రభుత్వ ప్రయోజనాలకు నష్టం కలిగినట్లు లేదా విధి నిర్వహణలో దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి. శామ్‌ కోషి, జస్టిస్‌ నర్సింగ్‌రావు నందికొండతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.