చింతపల్లి వివాదాస్పద భూములపై స్టేటస్‌కో.. హైకోర్టు కీలక ఆదేశాలు

నల్లగొండ జిల్లా చింతపల్లిలోని వివాదాస్పద భూములపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టేటస్‌కో విధించింది. తుది విచారణ పూర్తయ్యే వరకు లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది.
Telangana High Court
తెలంగాణ హైకోర్టు
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లా చింతపల్లిలోని వివాదాస్పద భూములపై హైకోర్టు డివిజన్ బెంచ్ యథాతథస్థితి (స్టేటస్‌కో) ఉత్తర్వులు జారీ చేసింది. కేసుపై పూర్తిస్థాయి విచారణ ముగిసే వరకు ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని స్పష్టం చేసింది. గతంలో ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దేవాదాయశాఖ దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

చింతపల్లిలోని తమ భూముల రిజిస్ట్రేషన్లకు సబ్‌ రిజిస్ట్రార్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన నిర్మలతో పాటు మరికొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. చట్టప్రకారం గెజిట్ నోటిఫికేషన్ లేకుండా కేవలం దేవాదాయశాఖకు చెందిన భూములని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లను నిలిపివేయలేరని స్పష్టం చేశారు.

దేవాదాయశాఖ పంపిన లేఖలు, సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని సేల్ డీడ్ల రిజిస్ట్రేషన్లను తిరస్కరించే అధికారం సబ్‌ రిజిస్ట్రార్లకు లేదని పేర్కొన్నారు. దేవాదాయశాఖ సమర్పించిన కొన్ని రికార్డుల్లో ఈ భూములు గట్టుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందినవిగా ఉన్నప్పటికీ.. ఇతర రెవెన్యూ రికార్డులు అందుకు భిన్నంగా ఉన్నాయని గుర్తించారు. గతంలో 2013, 2015లో జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను సైతం రద్దు చేశారు. చట్టప్రకారం ఇతర అర్హతలు ఉంటే పిటిషనర్లకు అనుకూలంగా ఉన్న సేల్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.

దేవాదాయశాఖ అప్పీల్‌.. స్టేటస్‌కో

సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దేవాదాయశాఖ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు శామ్‌ కోషి, సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకుండా స్టేటస్‌కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.