నగరం నడిబొడ్డున 35 అంతస్తుల నిర్మాణమా?

అబిడ్స్‌లోని మీనాక్షి ఎలీసియా 35 అంతస్తుల భవనానికి అనుమతులు ఎలా ఇచ్చారంటూ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
Telangana High Court
Telangana High Court questions 35-floor tower Permission near Moazzam Jahi Market
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున 35 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి అనుమతులు ఎలా మంజూరు చేశారంటూ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చారిత్రక మొజంజాహీ మార్కెట్‌కు సమీపంలోని అబిడ్స్‌ గన్‌ఫౌండ్రిలో చేపట్టిన ‘మీనాక్షి ఎలీసియా’ ప్రాజెక్టు అనుమతుల మంజూరు ప్రక్రియను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై సొసైటీ ఫర్‌ క్రూసేడ్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 35 అంతస్తులతో పాటు రెండు సెల్లార్లు, మరో ఐదు అదనపు స్థాయిలతో కూడిన నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

జీహెచ్‌ఎంసీ అనుమతులపై అభ్యంతరం

మీనాక్షి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) 2022 ఆగస్టులో అనుమతులు మంజూరు చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. చట్ట ప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పాటించకుండా, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారని వాదించారు. నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, ఇదే అంశానికి సంబంధించి మరో రిట్‌ పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. నిర్మాణంలో మరిన్ని అంతస్తుల పనులను నిలిపివేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి.. ఇదే అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌కు ప్రస్తుత కేసును జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన అధికారులు, నిర్మాణదారును ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించారు.