

ప్రభాత ఉదయం, హైదరాబాద్: ఐఏఎస్ ఆమ్రపాలిని తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పుపై స్టే రద్దు చేసే అంశంలో రెండు వారాల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. దీపావళి సెలవుల తర్వాతకు కేసు విచారణ వాయిదా పడింది. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. తుది తీర్పు వచ్చే వరకు క్యాట్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆమ్రపాలి మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపింది. ఆమ్రపాలి తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు నడిపించారు.
ఆమ్రపాలికి అన్యాయం జరిగింది..
తెలంగాణ కేడర్ కేటాయింపు ప్రక్రియలో ఆమ్రపాలికి అన్యాయం జరిగిందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఉమ్మడి ఏపీలో ఇన్‌సైడర్లుగా గుర్తించిన ఇద్దరు అధికారులను 2014 అక్టోబర్ 10 నాటి నోటిఫికేషన్‌లో ఔట్‌సైడర్లుగా మార్చారని తెలిపారు. దీని వల్ల తెలంగాణకు రావాల్సిన జనరల్ కేటగిరీ ఇన్‌సైడర్ పోస్టు తగ్గిపోయిందని వివరించారు. ఒక పోస్టు ఏపీకి అదనంగా వెళ్లిందని పేర్కొన్నారు. అధికారుల కేటాయింపు అనేది కేవలం సాధారణ నియామకం కాదని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం సమానమైన పంపిణీ జరగాలని వాదించారు. మరోవైపు, 2014 నాటి ఆ కేటాయింపు ప్రక్రియను ప్రస్తుత పిటిషన్‌లో నేరుగా సవాలు చేయలేరని ఏఎస్‌జీ అభ్యంతరం తెలిపారు. ఆ నాటి ప్రక్రియకు ఇప్పటి ఉత్తర్వులకు సంబంధం లేదని వాదించారు. ఈ వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు డిసెంబర్ 8 నాటి మధ్యంతర ఉత్తర్వుల రద్దుపై దాఖలైన అప్లికేషన్‌పై త్వరలో తుది నిర్ణయం వెలువరించనుంది.