హరీశ్‌రావు మామ భూ స్వాధీనంపై బలవంతపు చర్యలొద్దు

హరీశ్‌ రావు మామ మాధవరపు హన్మంతరావు భూమి విషయంలో తుది నిర్ణయం వెలువడే వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Telangana High Court
Telangana High Court No Coercive Action Harish Rao Father In Law Land Case
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు మామ మాధవరపు హన్మంతరావుకు చెందిన భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని 3 ఎకరాల 22 గుంటల భూమి నుంచి ఆయనను ఖాళీ చేయించరాదని స్పష్టం చేసింది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు రెండు వారాల్లోగా వివరణ సమర్పించాలని హన్మంతరావును ఆదేశించింది. జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నంబర్లు 271/18 ఈఈ, 271/18 ఈ, 271/98లోని 3 ఎకరాల 22 గుంటల భూమిని స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు సెప్టెంబర్‌ 29న షోకాజ్‌ నోటీసు జారీ చేశారంటూ హన్మంతరావు హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జే రామచందర్‌రావు వాదనలు వినిపించారు. నోటీసుపై వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం కల్పించకుండానే భూమిని స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చారని చెప్పారు. సంబంధిత భూమిని పిటిషనర్‌ చాలా కాలం క్రితమే మార్కెట్‌ ధర చెల్లించి కొనుగోలు చేశారని తెలిపారు. భూమిని స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న ఆందోళనతో షోకాజ్‌ నోటీసును నిలిపివేయాలని అభ్యర్థించారు. ఇలాంటి అంశాలపై ఇతరులు దాఖలు చేసిన కొన్ని పిటిషన్లలో హైకోర్టు ఉపశమనం కల్పించిందని, అదే తరహా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలను ప్రభుత్వ తరఫు రెవెన్యూ న్యాయవాది వ్యతిరేకించారు. షోకాజ్‌ నోటీసుకు పిటిషనర్‌ వివరణ సమర్పించే వరకు రెవెన్యూ అధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరని హామీ ఇచ్చారు. అయితే నోటీసును నిలిపివేస్తే తదుపరి ప్రక్రియను కొనసాగించడానికి అధికారులకు అవకాశం ఉండదని పేర్కొంటూ దానిపై స్టే విధించవద్దని కోరారు. పిటిషనర్‌ సమర్పించే వివరణను కోర్టు నిర్దేశించిన గడువులో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిట్‌ పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు పిటిషనర్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. వివాదాస్పద భూమి నుంచి ఆయనను ఖాళీ చేయించరాదని పేర్కొన్నారు. పిటిషనర్‌ రెండు వారాల్లో షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇవ్వాలని సూచించారు. కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు వీలుగా దసరా సెలవుల అనంతరం విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.