

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : 2015 నాటి ‘ఓటుకు నోటు’ కేసులో ఫిర్యాదుదారుడు, మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు హైకోర్టులో ఊరట లభించింది. సికింద్రాబాద్ బోయిగూడలోని ఆయనకు చెందిన 1936 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు జీవో ఎంఎస్ నంబర్ 134 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు స్టీఫెన్సన్ ఆస్తికి మాత్రమే వర్తిస్తాయని, జీవో పరిధిలోని ఇతర ఆస్తులకు వర్తించవని కోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణ వచ్చే నెల 2కు వాయిదా పడింది.
50 లక్షలు ఆఫర్ చేశారు
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చారని స్టీఫెన్సన్ పిటిషన్లో ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు, అనుచరులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని జీరా భూములకు సంబంధించి తనకు అనుసంధానమైన లీజు భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని కూడా జీవో అనుబంధంలో ప్రస్తావించారని తెలిపారు. 2015 నాటి ‘ఓటుకు నోటు’ కేసులో తాను ఫిర్యాదుదారుడినని, అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఓటును ప్రభావితం చేసేందుకు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని ఆరోపించారు. తొలుత ఈ పిటిషన్ యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం ముందుకు రాగా, విచారణ నిమిత్తం సింగిల్ జడ్జికి బదిలీ అయింది. దీంతో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ వ్యాజ్యాన్ని విచారించి స్టీఫెన్సన్ ఆస్తికి మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వైఖరిపై అభ్యంతరం వ్యక్తంచేసిన న్యాయస్థానం, ఈ వ్యవహారంలో తదుపరి కార్యాచరణపై వివరాలు సమర్పించాలని ఆదేశించింది.