ఖేలో ఇండియా పోటీలకు శాశ్వత ఏర్పాట్లు ​: సీఎం రేవంత్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో శాశ్వత క్రీడా మౌలిక వసతులు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ ​: రాష్ట్ర క్రీడాకారులకు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా ఖేలో ఇండియా పోటీలకు అత్యున్నత ప్రమాణాలతో శాశ్వత ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వనరులను కూడా ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడా పోటీల ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి క్రీడా శిక్షణను తెలంగాణ క్రీడాకారులకు అందించేందుకు ఈ పోటీలను ఒక గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను రూపొందించాలని స్పష్టం చేశారు. పాల్గొనే వేలాది మంద్రి క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో క్రీడా పోటీల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్​నినో పరిస్థితుల నేపథ్యంలో పోటీల ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కే రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (క్రీడలు) వాణీప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.