లబ్ధిదారుడు మరణిస్తే భార్యకు పింఛన్!

తెలంగాణ ప్రభుత్వం పింఛన్‌ బదిలీ విధానాన్ని దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్‌, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులకు విస్తరించింది.
Widow Pension Scheme In Telangana
వితంతు పింఛన్ మంజూరు చేసే విధానాన్ని మరిన్ని కేటగిరీలకు విస్తరించిన తెలంగాణ ప్రభుత్వం.
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్తలు మరణిస్తే వారి భార్యలకు తక్షణమే పింఛన్ అందుతున్నది. ఈ విధానాన్ని ప్రభుత్వం మరిన్ని కేటగిరీలకు విస్తరించింది. దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ బాధితులు, ఫైలేరియా బాధితులకూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. పింఛన్ పొందుతున్న జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలన్న లక్ష్యంతో ఈ విధానానికి రూపకల్పన చేశారు. మరణించిన పింఛన్ దారుడి భార్య వయసు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వితంతు పింఛన్‌, 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్‌ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, మరణించిన పింఛన్‌దారుడి ఆధార్‌ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించి పింఛన్‌కు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి, చేయూత పోర్టల్‌లో వివరాలు నమోదు చేయనున్నారు.