తెలంగాణ స్పెషల్‌ పుంటికూర!

తెలంగాణ వంటకాలంటేనే ముందుగా గుర్తొచ్చేది పుంటికూర (గోంగూర) పచ్చడి. తరతరాలుగా మన వంటింట్లో ప్రత్యేక స్థానం. రుచికే కాదు.. శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలను అందించడంలోనూ తనదైన పాత్ర పోషిస్తోంది.
Sorrel Leaves
పుంటికూర (గోంగూర)
Published on: 

పులుపులోనే ప్రత్యేకత!

తెలంగాణలో పుంటికూర లేని భోజనం చాలామందికి అసంపూర్తిగానే అనిపిస్తుంది. పుంటికూర పచ్చడి, పప్పులో పుంటికూర, మాంసంతో పుంటికూర.. ఇలా ఎన్నో రకాలుగా వండుకుంటారు. దీని ప్రత్యేకమైన పుల్లటి రుచే ఇతర ఆకుకూరల నుంచి దీనిని వేరుగా నిలబెడుతుంది. అయితే పుంటికూర రుచితో పాటు పీచు పదార్థం, విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయని తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ వెల్లడించింది.

జీర్ణక్రియకు పీచు పదార్థం

పుంటికూర ల ఉండే పీచు పదార్థం జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్ధకం సమస్యను తగ్గించడంలోనూ పీచు పదార్థం ఉపయోగపడుతుంది. పప్పులు, ఇతర కూరగాయలతో కలిపి పుంటికూరను వండుకోవడం వల్ల భోజనంలో పోషకాల వైవిధ్యం పెరుగుతుంది.

పుటికూర చట్నీ
పుటికూర చట్నీ

రోగనిరోధక శక్తికి విటమిన్‌ సి

పుంటికూరలో విటమిన్‌ సి కూడా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు, శరీరానికి అవసరమైన విటమిన్‌ సి ఆహారం ద్వారా అందుతుంది. అందుకే పుంటికూరను కేవలం పుల్లటి రుచి కోసం మాత్రమే కాకుండా పోషక విలువలున్న ఆకుకూరగా కూడా చూడొచ్చు.

ఐరన్‌, కాల్షియం.. మరిన్ని ప్రయోజనాలు

పుంటికూరలో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి. ఐరన్‌ ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుతో పాటు శరీరంలోని పలు కీలక ప్రక్రియల్లో భాగంగా ఉంటుంది.

మన సంప్రదాయ వంటకానికి పోషకాల తోడు

పుంటికూరకు తెలంగాణలో ఉన్న ఆదరణ కేవలం దాని పోషకాల వల్ల వచ్చింది కాదు. మన నేల, మన ఆహారపు అలవాట్లు, మన సంప్రదాయాలతో దీనికి విడదీయలేని అనుబంధం ఉంది. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో కనిపించే పుంటికూర.. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు అందించే ఆకుకూర. అందుకే తెలంగాణ భోజనంలో పుంటికూరకు ఎప్పటికీ ప్రత్యేక స్థానమే!