మిల్లింగ్ మాఫియా

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ధాన్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ దాడుల్లో గుర్తించారు. అక్రమాల విలువ రూ.118 కోట్లుగా నిర్ధారించినట్లు కథనం పేర్కొంది.
Telangana rice mill irregularities
Published on: 

కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరిన ధాన్యం లెక్కల్లో కనిపిస్తున్నా.. గోదాముల్లో కనిపించడం లేదు. ఎఫ్‌సీఐ చేరాల్సిన బియ్యం పొరుగు రాష్ట్రాల బాట పట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్‌ అధికారుల దాడులతో డొంక కదిలినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పౌరసరఫరాల శాఖ తీరుపై అనుమాలాలకు తావిస్తోంది.  

ప్రభాత ఉదయం ప్రతినిధి, మహబూబ్‌నగర్: మిలర్ల మాయాజాలం.. పౌరసరఫరాల శాఖ అధికారుల అలసత్వం.. లంచాల ఆరోపణలు.. వెరసి బియ్యం ధరలు రోజురోజుకు చుక్కలనంటుతున్నాయి. నెల క్రితం 25 కేజీలకు రూ.1,300 ఉన్న బియ్యం ధర ప్రస్తుతం రూ.2,500కు చేరింది. మిల్లర్లు వరి ధాన్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండడంతో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.  

ధాన్యం పక్కదారి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 507 రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు.  ఈ సమయంలో భారీ ఎత్తున అక్రమాలను గుర్తించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు పంపిన ధాన్యాన్ని సీఎంఆర్ ( కస్టమ్ మిల్లింగ్ రైస్) చేసి ఎఫ్‌సీఐ కి పంపాలి. ఇందుకు విరుద్ధంగా కొన్ని రైస్ మిల్లుల యజమానులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ధాన్యం తరలించి అక్రమ మార్గంలో డబ్బులు దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు( వానాకాలం, యాసంగి)పంటల్లో 18 లక్షల మెట్రిక్ టన్నుల  ధాన్యం రైస్ మిల్లులకు చేరుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  గద్వాలలో ఒకే రైస్ మిల్లు నుంచి 50 వేల క్వింటాళ్ల బియ్యం కర్ణాటకకు తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో బయటపడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక రైస్ మిల్లులో 94 వేల క్వింటాళ్ల ధాన్యం ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. ఇలా పక్కదారి పట్టిన ధాన్యం విలువ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.118 కోట్లుగా నిర్ధారించారు. మరికొందరు మిల్లర్లు పీడీఎస్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి పంపించే బియ్యంలో కలుపుతున్నట్లు విజిలెన్స్ శాఖ గుర్తించింది. బాధ్యత తీసుకోవాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం రైస్ మిలర్ల అక్రమాలకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఎవరికి వారు అక్రమాలు చేస్తుండడంతో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పౌరసరఫరాల శాఖపై దృష్టి సారించి అక్రమాలను అరికట్టి బియ్యం ధరలు అదుపు చేయాలని కోరుతున్నారు.