

ప్రభాతఉదయం, హైదరాబాద్ : ఎల్ నినో, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ వానాకాలం సీజన్లో కూరగాయల సాగు పెరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సంప్రదాయ వరి, పత్తి పంటల స్థానంలో కూరగాయలు, ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపారు. 2025 వానాకాలం సీజన్లో 48,041 ఎకరాల్లో కూరగాయలు సాగవగా.. ఈ ఏడాది 80,200 ఎకరాలకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే కూరగాయల సాగు విస్తీర్ణం రెట్టింపయింది. యాసంగిలో మరింత పెరిగే చాన్స్ ఉందని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగును మరింత పెంచేలా ఉద్యానవన శాఖ కార్యాచరణను రూపొందించారు.
వర్షాభావ పరిస్థితులే కారణం
కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడానికి ఎల్ నినో, వర్షాభావ పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. దీనికితోడు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద రాలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగు తగ్గించాలని సూచిస్తోంది. దీంతో రైతులు కూరగాయల సాగు వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. దీంతో ఈ జిల్లా రైతులు ప్రధానంగా కూరగాయల సాగుపై ఫోకస్ చేశారు. ఈ జిల్లా రైతులు ఈసారి 5,748 ఎకరాల్లో కూరగాయలు పండించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. రంగారెడ్డి జిల్లాలో 5,370 ఎకరాలతో రెండో స్థానంలో నిలిచింది. నాగర్ కర్నూల్లో 3,354 ఎకరాలు, మహబూబ్నగర్లో 2,570 , వికారాబాద్లో 2,456 , సూర్యాపేటలో 1,126, సంగారెడ్డిలో1,104, గద్వాలలో 1,188, మెదక్ లో1,776 ఎకరాల్లో కూరగాయలు సాగాయ్యాయి.
కూరగాయల సాగు 2లక్షల ఎకరాలకు పెంచేలా..
రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో కూరగాయల కొరతను తీర్చేందుకు రాష్ట్రంలోనే పండించేలా ఉద్యానవన శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా 2 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. సమీకృత ఉద్యాన మిషన్ స్కీమ్ ద్వారా 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు నుంచి పంటను మార్కెట్కు తరలించే వరకు ఈ ఖర్చు వర్తించనుంది. ఒక రైతుకు గరిష్ఠంగా 2.5 ఎకరాల వరకు సబ్సిడీ అందనుంది. హైదరాబాద్లోని జీడిమెట్ల, ములుగు, సిద్దిపేటలోని ప్రభుత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో టమాట, బెండ, వంకాయ, కాకర, దొండ, మిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల సాగుకు నాణ్యమైన నారును అందిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో కూరగాయల సాగును పెద్ద ఎత్తున పెంచాలని ఉద్యానవన శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.