నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కొలువు!

Telangana Village Level Unemployment Survey
Telangana Village Level Unemployment SurveyAI Generated
Published on: 

• ఊరూరా సర్వే..12,700 గ్రామాల్లో వివరాల సేకరణ

• గ్రామ కార్యదర్శులకు బాధ్యత..జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

ప్రభాత ఉదయం, వరంగల్ :  నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామాల వారీగా నిరుద్యోగుల వివరాలను సేకరించబోతున్నది. రాష్ట్రంలో సుమారు 12,700కుపైగా గ్రామాల్లో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగుల వివరాలను సేకరించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. యువత విద్యార్హతలు, నైపుణ్యాలు, ఆసక్తి గల రంగం..తదితర వివరాలను నమోదు చేయడంతో పాటు, సంబంధిత గ్రామ కార్యదర్శి వాటిని పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనంతరం ఆ వివరాలను ‘ఈ-పంచాయత్‌’ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. నిరుద్యోగులు ఏ గ్రామంలో ఎంతమంది? వారి విద్యార్హతలేంటి? మొదలైన వివరాలతో సమగ్ర డేటాబేస్‌ను రాష్ట్ర సర్కార్ రూపొందించబోతున్నది. దీని ఆధారంగా ప్రైవేట్ కంపెనీల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ ఉంటుందని సమాచారం.  ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకూ ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయని తెలిసింది.  

వివరాల సేకరణకే పరిమితమా?

లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించలేరు కాబట్టి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల్ని వారి ముందుకు తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. గ్రామస్థాయి నుంచి సేకరించే డేటాను ఎంత సమర్థంగా వినియోగిస్తుంది? ఎన్ని ప్రైవేట్ కంపెనీలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తుంది? అన్నది ప్రభుత్వం ముందున్న సవాల్. నిరుద్యోగ సర్వే కేవలం వివరాల సేకరణకే పరిమితమవుతుందా? యువత చేతుల్లో నియామక పత్రాలు పెట్టే వరకు సాగుతుందా? అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.