

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కీలక దశకు చేరింది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పులకు సంబంధించి జారీ చేసిన నోటీసుల ప్రక్రియ భారీ స్థాయిలో కొనసాగుతోంది. అక్టోబర్ 1 మధ్యాహ్నం 2 గంటల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 92,88,180 నోటీసులు సిద్ధం చేయగా, 89,33,998 నోటీసులు అందజేశారు. 3,54,182 నోటీసులు పెండింగ్లో ఉన్నాయి. నోటీసుల పంపిణీ దాదాపు పూర్తవుతున్నప్పటికీ.. విచారణ, ధ్రువీకరణ దశల్లో మాత్రం గణనీయమైన పని మిగిలే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 65,62,919 నోటీసులకు విచారణ పూర్తయింది. అయితే 25,93,780 కేసుల్లో విచారణ తేదీల గడువు ముగిసింది. మరో 47,522 కేసుల్లో రీషెడ్యూల్ చేసిన తేదీలు కూడా గడువు ముగిసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
డీఈవోల వద్ద 2.70 లక్షలు
విచారణ అనంతరం డీఈవో స్థాయిలో చేపట్టాల్సిన పరిశీలనలోనూ భారీగా పెండింగ్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,69,662 కేసులు డీఈవో స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 1,20,606 కేసులు ఐదు రోజులకు మించి పెండింగ్లో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు 23,96,484 కేసులను డీఈవోలు ధ్రువీకరించారు. మరో 1,071 కేసులు విచారణ కాకుండా ఉన్నాయి. పరిశీలనలో 6,788 కేసులు అనర్హమైనవిగా గుర్తించారు. తుది ప్రచురణ ప్రక్రియలో నోటీసుల ఆధారంగా 54,13,423 కేసులు గుర్తించగా, ఇతర అంశాలకు సంబంధించి 1,56,31,818 కేసులు గుర్తించినట్లు నివేదికలో నమోదైంది.
గ్రేటర్లోనే పెండింగ్ అధికం
జనాభా అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నోటీసుల సంఖ్యతో పాటు పెండింగ్ కూడా గణనీయంగా ఉంది. రంగారెడ్డిలో 12,33,491 నోటీసులు సిద్ధం చేయగా, 1,62,402 పెండింగ్లో ఉన్నాయి. మేడ్చల్– మల్కాజిగిరిలో 14,07,352 నోటీసులకు గాను 64,503, హైదరాబాద్లో 12,53,876 నోటీసులకు గాను 22,009 పంపిణీ కావాల్సి ఉంది.
ఉమ్మడి వరంగల్లో ఇలా
ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోనూ నోటీసుల ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది.
- వరంగల్ జిల్లాలో 1,94,395 నోటీసులు సిద్ధం చేయగా, 1,86,189 పంపిణీ పూర్తయింది. 8,206 నోటీసులు పెండింగ్లో ఉన్నాయి. విచారణ దశలో 1,04,181 కేసులు పూర్తికాగా, 87,458 కేసుల్లో గడువు ముగిసింది.
- హనుమకొండలో 1,32,070 నోటీసులకు గాను 1,31,779 పంపిణీ పూర్తయింది. 291 నోటీసులు పెండింగ్లో ఉన్నాయి. విచారణ దశలో 1,12,550 కేసులు పూర్తయ్యాయి. 13,131 కేసుల్లో విచారణ గడువు ముగిసింది.
- ములుగులో 41,900 నోటీసులకు గాను 41,196 పంపిణీ చేశారు. 704 నోటీసులు పెండింగ్లో ఉన్నాయి. విచారణ దశలో 30,595 కేసులు పూర్తికాగా, 9,782 కేసుల్లో గడువు తేదీ ముగిసింది. డీఈవో స్థాయిలో 237 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
- జయశంకర్ భూపాలపల్లిలో 32,636 నోటీసులు అధికారులు పంపిణీ చేశారు.
తుది జాబితాపై దృష్టి
నోటీసుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుతున్న నేపథ్యంలో విచారణ, ధ్రువీకరణ, అర్హత, అనర్హత నిర్ధారణ, తుది ప్రచురణ ప్రక్రియపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది. ముఖ్యంగా విచారణ గడువు తేదీలు ముగిసిన 25.94 లక్షల కేసులు, డీఈవో స్థాయిలో పెండింగ్లో ఉన్న 2.70 లక్షల కేసులు తదుపరి ప్రక్రియలో కీలకంగా మారనున్నాయి.