

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : పోలీస్ శాఖలో అన్ని ర్యాంకుల్లో ‘మహిళా పోలీస్’ అనే పదాన్ని తొలగించి.. పురుషులతో సమానంగా అందరినీ ‘పోలీస్’గానే పరిగణించాలని చేసిన తీర్మానం అటకెక్కింది. గత ఏడాది పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సంక్షేమం కోసం తొలిసారి సదస్సు నిర్వహించి లేవనెత్తిన సమస్యలలో ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు. గత సంవత్సరం ఆగస్టు నెలలో 20, 21 తేదీలలో పోలీస్ అకాడమిలో మహిళా పోలీస్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డీజీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు పాల్గొన్నారు. మహిళా సిబ్బంది, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను వినిపించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్న 80 వేల మంది సిబ్బందిలో 7,500 మంది మహిళా సిబ్బంది ఉన్నారని.. 33 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదని తెలిపారు. చాలా పోలీస్ స్టేషన్లలో లింగవివక్ష ప్రధాన సమస్యగా ఉందని, కొన్నిచోట్ల లైంగిక వేధింపులూ ఉన్నట్టు పేర్కొన్నారు. షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ విభాగాల్లో పనిఒత్తిడి ఉన్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ట్రైనింగ్ లీడర్ షిప్, ప్రమోషన్లలో మహిళలకు సమన్యాయం జరగడంలేదని వెల్లడించారు. చాలా పోలీస్ స్టేషన్లలో ఉమెన్ డ్రెసింగ్ రూంలు లేవనే విషయాన్ని సదస్సులో ప్రధానంగా ప్రస్తావించి.. కిందిస్థాయి సిబ్బంది పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, నేటికీ ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించలేదు.
థీమ్ కమిటీలతోనే సరి..
సదస్సులో లేవనెత్తిన ఐదు ప్రధాన సమస్యలపై చర్చించేందుకు థీమ్ కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కో టీంలో డీజీ, ఏడీజీపీ, డీసీపీ స్థాయి అధికారులను సభ్యులుగా నియమించారు. చైర్ పర్సన్‌తో పాటు సభ్యులకు సమస్యలను వివరించే విధంగా కార్యాచరణ రూపొందించారు. లింగ వివక్ష, శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి కమిటీకి చైర్ పర్సన్‌గా సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్‌ను, పని ప్రదేశంలో వేధింపుల సమస్య పరిష్కార కమిటీకి చైర్ పర్సన్‌గా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీపీ చారు సిన్హా, పని, జీవిత సమతుల్యత, ఆరోగ్యం, సంక్షేమ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఈవోడబ్ల్యూ డీజీపీ ఏబీ బాల నాగదేవి, సంస్థాగత సంస్కృతి మార్పు కమిటీ చైర్ పర్సన్‌గా టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, పనిప్రదేశంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, బందోబస్త్, వ్యక్తిగత భద్రత, హింసకు గురికావడం తదితర అంశాల కమిటీ చైర్ పర్సన్‌గా ఏడీజీపీ స్వాతి లక్రాను నియమించారు. అయితే, ఆయా అంశాలపై వారు తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సమస్యలకు నేటికీ పరిష్కారం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సదస్సులో చేసిన తీర్మానాలు ఇవే:
ప్రతి యూనిట్ లేదా జోన్లో మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) నియామకం చేపట్టాలి.
ట్రాఫిక్ విధులు కేటాయించాలి.
టెక్నాలజీ ట్రెయినింగ్ మాడ్యూల్స్‌లో 10 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి.
సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, అల్లర్ల నిరోధక కసరత్తులలో మహిళా
ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించాలి.
లింగ సమానత్వాన్ని అంచనా వేయడానికి ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా ప్రతి 1-2 సంవత్సరాలకు ఎక్స్టర్నల్ జెండర్ ఆడిట్లను నిర్వహించాలి.
మహిళా సిబ్బంది కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో రెండు ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఏర్పాటు చేయాలి.
చిన్న పిల్లలు ఉన్న వారికి స్థానిక డే కేర్ కేంద్రాలతో (అంగన్వాడీ కేంద్రాలు) సమన్వయం చేయాలి.
40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి హెల్త్ చెకప్ నిర్వహించాలి.
మహిళల ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణను ప్రవేశపెట్టాలి.
ఆయుధాల నిర్వహణ, ఫైరింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వాలి.
డ్రైవింగ్, స్విమ్మింగ్, ఇతర స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలి.
తమిళనాడు తరహాలో వస్త్రధారణ, మేకప్, ఉపకరణాలు, నేమ్ ప్లేట్ స్పెసిఫికేషన్లతో కూడిన ఏకరీతి నమూనా మార్గదర్శకాలను అమలు చేయాలి.
సాయుధ రిజర్వ్, సివిల్ సిబ్బంది కోసం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్యకరమైన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలి.
వారాంతపు సెలవుతో పాటు రాత్రి విధుల మరుసటి రోజు సెలవు ఇవ్వాలి.