కృష్ణా, గోదావరి బోర్డుల తీరుపై తెలంగాణ గుర్రు.. నిధులకు బ్రేక్‌?

కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పనితీరు, వ్యవహార శైలిపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
Telangana Andhra Pradesh river water disputes
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ :  తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి వచ్చే వారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 26, 30 తేదీల్లో జరగనున్న ఈ భేటీల్లో పలు కీలక అంశాలను లేవనెత్తేందుకు తెలంగాణ జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. బోర్డుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాష్ట్ర అధికారులు.. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా వ్యవహరించకపోతే వాటికి చెల్లించాల్సిన నిధులను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ జలవనరుల శాఖ పలుమార్లు నదీ యాజమాన్య బోర్డుల పనితీరు, పక్షపాత ధోరణులపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ వాటి వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదని సీనియర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ నిరసనగా రెండుసార్లు నిధులు నిలిపివేసినా ఆశించిన ఫలితం రాలేదని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో 26, 30వ తేదీల్లో జరగనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల సమావేశాలలో పలు అంశాలపై తమ అభ్యంతరాలను లేవనెత్తుతామన్నారు. ఏపీ జలవనరుల శాఖ చెప్పుచేతల్లో వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రస్తావించనున్నారు. వరదల సీజన్‌లో ఏపీ అధిక మొత్తంలో నీటిని తరలించుకు పోయింది. ఇష్టానుసారంగా  నీటిని తరలించుకుపోతున్నా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తోందనే అంశాలను నిలదీయనున్నారు.

బోర్డు సమావేశాల అజెండాను ఏపీ ప్రభుత్వం ఖరారు చేయడం, తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల విషయంలో కృష్ణా బోర్డు వ్యవహార శైలిపై రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా వ్యవహరిస్తామని బోర్డులు హామీ ఇస్తేనే నిధులు కేటాయించాలని, లేదంటే సహాయ నిరాకరణ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని షరతులు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

గోదావరి జలాల్లో తెలంగాణకు 950 నుంచి 1,000 టీఎంసీల వరకు వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. నదిపై రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోందని అధికారులు ఆరోపిస్తున్నారు. జీఆర్ఎంబీ కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడం లేదని వాపోతున్నారు. ఈ అంశాలను బోర్డు సమావేశంలో లేవనెత్తాలని నిర్ణయించారు. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో తెలంగాణలో 120 కిలోమీటర్ల మేర ముంపు సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలుమార్లు విన్నవించినా కేంద్ర జల సంఘం, ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదని పేర్కొంటున్నారు.

పోలవరం ప్రాజెక్టును 2027 మే నెలాఖరుకు పూర్తి చేసి, జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించినా.. బోర్డు స్పందించకపోవడంపై తెలంగాణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా నదీ యాజమాన్య బోర్డులు వ్యవహరిస్తే ఈసారి నిధుల కేటాయింపును నిలిపివేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించేలా సమావేశాల అజెండాను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.