

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన పథకాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని టీజీ రెడ్కో ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల మేనేజర్లు, పథకాల అమలు సంస్థల ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఇంధన పొదుపు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు.
గృహజ్యోతి పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును విస్తృతం చేయాలని ఎండీ ఆదేశించారు. వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్, పీఎం-కుసుమ్ పథకం లక్ష్యాల సాధనకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. పథకాల అమలుకు అవసరమైన వివిధ శాఖల అనుమతులు, పెండింగ్ తనిఖీలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా మేనేజర్లు, పథకాల అమలు సంస్థల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీజీ రెడ్కో జనరల్ మేనేజర్ జీఎస్వీ ప్రసాద్ తో పాటు వివిధ విభాగాల ఇన్చార్జీలు పాల్గొన్నారు.