

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లైమేట్ చేంజ్, సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్‌పై ప్రత్యేక బీఏ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన 6వ ఎడిషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఫర్ క్లైమేట్ యాక్షన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల చట్ర సదస్సు 31వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్‌కు ముందస్తు సన్నాహక కార్యక్రమంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి, కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో పర్యావరణ పరిరక్షణ, సంరక్షణ, పునరుద్ధరణ అత్యంత కీలకమైన సవాళ్లుగా మారుతున్నాయన్నారు. పర్యావరణ సమస్యల పరిష్కారంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే ఈ తరహా కోర్సును ప్రవేశపెట్టడం ఒక వినూత్న, మార్గదర్శక విద్యా కార్యక్రమంగా నిలుస్తుందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సును ప్రవేశపెడతామని బాలకిష్టారెడ్డి తెలిపారు.