

ప్రభాత ఉదయం, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరింత పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించడమే స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని తెలంగాణ టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ఈ మీటర్ల ఉద్దేశమన్నారు. సోమవారం జీడిమెట్ల స్మార్ట్ గ్రిడ్ పైలట్ ప్రాజెక్టు పరిధిలోని షాపూర్‌నగర్ అపురూప కాలనీలో సీఎండీ పర్యటించి స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ గ్రిడ్ ఆటోమేషన్ వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారు మద్దిపాటి మాధురి లతతోపాటు పలువురు వినియోగదారులతో సీఎండీ నేరుగా మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల పనితీరు, బిల్లింగ్ ప్రక్రియ, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులు తమ రోజువారీ విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని, ఏ సమయంలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు, వినియోగం ఎప్పుడు పెరుగుతోంది అనే వివరాలను విశ్లేషించుకోవచ్చని సీఎండీ వివరించారు. ఈ సమాచారం ఆధారంగా అవసరానికి అనుగుణంగా వినియోగాన్ని నియంత్రించుకోవడంతోపాటు, విద్యుత్ బిల్లులపై స్పష్టమైన అవగాహన పొందవచ్చన్నారు