

ప్రభాత ఉదయం, ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని ఇటికెల పహాడ్ ప్రాంతం పులుల సంచారానికి ఫ్రీ జోన్‌గా మారుతోంది. మహారాష్ట్రలోని తడోబా–అంధారి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణ అడవుల్లోకి ప్రవేశించే పులులకు ప్రధాన కారిడార్‌గా ఉపయోగపడుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం, నీటి వనరులు, జింకలు, సాంబర్లు, అడవి పందులు తదితరాలను ఆహారంగా తీసుకోవడం, మానవ జోక్యం తక్కువగా ఉండటంతో పులులు ఈ ప్రాంతాన్ని సురక్షిత ఆవాసంగా ఎంచుకుంటున్నాయి. ఇటీవల అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో పులుల సంచారం కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు.
విహారానికి అనువుగా..
గతంలో ఆక్రమణలకు గురైన సుమారు 2 వేల ఎకరాల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని రీ ఫారెస్ట్ చేపట్టడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం మళ్లీ దట్టమైన అడవిగా మారింది. దీంతో పులుల సంచారానికి అనువైన వాతావరణం ఏర్పడింది.
పండ్ల మొక్కల పెంపకం
వన్యప్రాణులకు అవసరమైన ఆహారం కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పులుల ఆహారమైన జింకలు, సాంబార్, అడవి పందులు, ఎలుగుబంట్లు, కోతులు, కుందేళ్లు ఇతర జంతువులు ఇక్కడ ఉంటున్నాయి. వాటికి ఏడాది పొడవునా ఆహారం అందేలా మారేడు, ఉసిరి, ఇరికి, అల్లనేరేడు, నేరేడు, రేగు, వెలగ, తానికాయ తదితర పండ్ల మొక్కలను పెంచుతున్నారు. మరోవైపు గడ్డి జాతులను పెంచడానికి చర్యలు ప్రారంభించారు.
ఒక గ్రామమే అడ్డంకి..!
పులులు రాకపోకలు సాగించడానికి ఈ కారిడార్‌లో ఇటికెల పహాడ్ గ్రామం అడ్డంకిగా ఉన్నట్లు అటవీ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వన్యప్రాణుల నిరంతర సంచారానికి ఆటంకాలు తొలగించాలనే ఉద్దేశంతో గ్రామస్థులకు పునరావాసం కల్పించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం తగిన పరిహారం, ప్రత్యామ్నాయ భూములు, మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి భరోసా కల్పిస్తే పునరావాసంపై చర్చించేందుకు గ్రామస్థులు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘పులులు ఇటికెల పహాడ్ అటవీ ప్రాంతాన్ని సుస్థిర ఆవాసంగా మార్చుకునే పరిణామం త్వరలో సాకారం అవుతుంది. వన్యప్రాణులన్నింటికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వాటి రక్షణకు నిరంతరం ట్రాకింగ్ చేస్తున్నాం’’ అని డీఎఫ్‌వో బాలామణి చెప్పారు.