గ్రూప్ రాజకీయాలపై పీసీసీ చీఫ్ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత విభేదాలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టి సారించారు. క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
PCC chief Mahesh Kumar Goud
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీలోని వివిధ నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య ముదురుతున్న వివాదాలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్ సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం, జరుగుతున్న పరిణామాలపై ఆయన దృష్టి పెట్టారు. ఢిల్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్మీ కాంతారావు మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో వారిని పిలిచి మాట్లాడాలని ఆయన నిర్ణయించారు. గురువారం గాంధీ భవన్​కు రావాల్సిందిగా వారిద్దరికి సమాచారం పంపించారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇటీవల చోటుచేసుకున్న క్రమశిక్షణ రాహిత్యంపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్​ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు.