ప్రభాత ఉదయం, సిద్దిపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ఉపాధ్యాయుల సామూహిక రిలే దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్ఐ), టీఎస్ యూటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన చేపడుతున్నామని వివరించారు. విద్యాహక్కు చట్టం అమలుకు ముందు నియమితులైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ విద్యా విధానం -2020ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయపెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ప్రాథమిక పాఠశాలలకు నష్టం కలిగించే జీఓ నంబర్ 25ను సవరించాలని కోరారు. వేతన సవరణ కమిషన్ నివేదికను తెప్పించుకుని, దాని సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు చేపడుతున్న ఉద్యమంలో భాగంగా నిర్వహించే ఈసామూహిక దీక్షను విజయవంతం చేయాలని, పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శివలింగం, జిల్లా కమిటీ సభ్యులు జక్కుల నర్సింలు, దేవులపల్లి గిరిబాబు, ఎన్.యాదయ్య, ఎస్.రమణాచారి, బి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.