నోటీసులివ్వకుండా సిబ్బందిని తొలగించొద్దు..వర్సిటీల రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యామండలి సెక్రటరీ లేఖ

తెలంగాణ యూనివర్సిటీల్లో ఉద్యోగుల తొలగింపుపై ఉన్నత విద్యామండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు నోటీసులు తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేసింది.
నోటీసులివ్వకుండా సిబ్బందిని తొలగించొద్దు..వర్సిటీల రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యామండలి సెక్రటరీ లేఖ
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించొద్దని ఉన్నత విద్యామండలి సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్ సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు ఆయన లేఖ రాశారు. ఈ అంశంపై తనకు ఫిర్యాదులు అందుతున్నాయని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం సరైన చర్యకాదని లేఖలో పేర్కొన్నారు. నిర్ణీత విధానాలను అనుసరించకుండా తీసుకునే చర్యలు సిబ్బంది సేవా షరతులపై, వారికి లభించాల్సిన సహజ న్యాయంపై ప్రభావం చూపుతాయన్నారు. అంతేకాకుండా.. యూనివర్సిటీల విద్యా వాతావరణంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్నారు. ఈ విషయంపై వెంటనే అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలకు తగిన సూచనలు జారీ చేయాలన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.