ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం

ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. చిన్నజీయర్ స్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ నిర్వహించారు.
Sri Venkateswara Swamy temple in Khammam
TTD chairman lays foundation for Sri Venkateswara Swamy temple in Khammam
Published on: 

ప్రభాత ఉదయం, ఖమ్మం: వెంకటేశ్వరస్వామి ఖమ్మంలో కొలువుదీరేందుకు తొలి అడుగు పడింది. జిల్లాలో శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ రామానుజ చిన్నజీయర్ స్వామి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.

 వేదమంత్రాల సాక్షిగా ఆధ్యాత్మిక శుభారంభం

ఆగమ శాస్త్ర సాంప్రదాయాలకు అనుగుణంగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రోక్షణ, భూమిపూజ అనంతరం చిన్నజీయర్ స్వామితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ ఖమ్మం నగరం రెండు తెలుగు రాష్ట్రాలను ఆధ్యాత్మికంగా అనుసంధానించే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ కృషి చేస్తోందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తన హయాంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అడుగులు పడడం పూర్వజన్మ సుకృతమని మంత్రి తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఎస్‌ఈ ఇన్‌చార్జ్ ఎస్ ప్రసాద్, డీఈ సురేంద్రనాథ్‌రెడ్డి, సూపరింటెండెంట్ మల్లికార్జున, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ బోర్డుల చైర్మన్లు, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 ఆలయంతోపాటు ఉపాలయాలు, రాజగోపురం

ఖమ్మంలో నిర్మించనున్న ఈ దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం, పోటు (వంటశాల), ప్రాకారం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. అర్బన్ మండలం దంసలాపురం రెవెన్యూ  పరిధిలోని సర్వే నంబరు 408/2లో ఆలయ నిర్మాణం కోసం 20.04 సెంట్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రహరీ నిర్మాణం కోసం టీటీడీ రూ.3.40 కోట్లు మంజూరు చేసింది.