కోటి వ్యయం.. పదేళ్లుగా నిరుపయోగం

ఉమామహేశ్వర దేవస్థానం వద్ద భక్తుల వసతి కోసం నిర్మించిన పర్యాటక అతిథిగృహం నిర్లక్ష్యంతో శిథిలమైంది. మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని భక్తులు కోరుతున్నారు.
Umamaheshwaram tourism guest house
Umamaheshwaram Tourism Guest House
Published on: 

ప్రభాత ఉదయం, అచ్చంపేట: ఏదైనా ప్రజాధనంతో నిర్మాణం ప్రారంభించే సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల హంగామా అంతాఇంతా కాదు. నిర్మాణం పూర్తి అయ్యాక.. వినియోగం అవుతోందా, లేదా అని ఆరా తీస్తున్న దాఖలాలు లేవు. నిర్వహణనూ గాలికి వదిలేస్తున్నారనడానికి పర్యాటక శాఖ అతిథిగృహం తీరే నిదర్శనం.

అచ్చంపేట మండల పరిధిలోని ఉమామహేశ్వర దేవస్థానం శ్రీశైలం ఉత్తర ద్వారంగా ఎంతో పేరుగాంచింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు, పర్యాటకులకు తగిన వసతి కల్పించడానికి కోటి రూపాయల వ్యయంతో పర్యాటక శాఖ అతిథి గృహాన్ని నిర్మించింది. దీన్ని నిర్మించి పదేళ్లు కావస్తున్నా వినియోగించకపోవడంతో రూ.కోటి బూడిదలో పోసిన పన్నీరులా మారింది. భవనం గదుల తలుపులు, కిటికీలు ఊడిపోయాయి. పరిసరాలు పూర్తిగా చెట్ల పొదలతో నిండిపోయి, భవనం శిథిలావస్థకు చేరుకుంది.  ప్రతి ఏడాది ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. రంగాపూర్‌లో నిర్వహించే ఉర్సు వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఉత్సవాలతోపాటు ఇతర రోజుల్లో అతిథి గృహాన్ని వినియోగించుకుంటే పర్యాటక శాఖకు ఆదాయం కూడా పెరుగుతుంది.  భవనం నిర్వహణను అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుందని పర్యాటకులు, భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనానికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.